వెయిట్ అండ్ వాచ్ కాదు గుబులు గుబులుగా హీరోలు
ఆల్మోస్ట్ కృష్ణానగర్ ఇందిరా నగర్ మొదలు ఫిలింనగర్ వరకూ దాదాపు 1000 కరోనా పాజిటివ్ కేసులు 20 కంటైన్ మెంట్ జోన్లతో విలయతాండవమాడేస్తుంటే ఆ ఏరియాలో సినిమా ఆఫీసులు తెరిచేదెలా? ప‌్రస్తుతం ఇదే సందేహం. కోవిడ్ మహమ్మారీ సినిమా వాళ్ల చుట్టూనే తిరుగుతోంది. ఎవరు దొరుకుతారా? అని ఎదురు చూస్తోంది అంటే తప్పేమీ కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పెద్దవాళ్లు అయినా సినిమాలు తీయడమెలా? అంటే .. అందుకేగా అంతా వేచి చూస్తున్నారు. అసలే కార్మికులు దొరకడం లేదు. ఊళ్లకు పోయి తిరిగి రావడం లేదు. ఒక రకంగా హైదరాబాద్ నుంచి 20లక్షల నుంచి 50లక్షల మంది జనం ఊస్టింగ్ అయిపోయారు. ఎటు పోయారో కూడా తెలీదనేది ఒక నివేదిక.
దొరికిన వాళ్లను దొరకని వాళ్లను వెతికి వెంటాడి మరీ వేటాడుతున్న కోవిడ్ వైరస్ దెబ్బకు జనం గాయబ్ అయ్యారు. ఒకరకంగా ఈ భయంతోనే స్టార్ హీరోలంతా మంచమెక్కేశారు. ఇల్లు కదిలి అడుగు కూడా బయటకు వేయడం లేదు. ఇందుకు విరుద్ధంగా నిర్మాతలు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. మోర్నింగ్ జాగింగ్ తప్ప ఇంకేదీ బయట చేయడం లేదు ఎవరూ. చిరంజీవి.. అల్లు అర్జున్.. మహేష్.. వీళ్లందరి పరిస్థితి ఇదే. చాలా మంది హీరోలు ఇంతకుముందులా బయట కనిపించనే లేదు. ఇక షూటింగులు అంటేనే ససేమిరా అనేస్తున్నారు.
ఇక నిర్మాతల వెర్షన్ ఎలా ఉంది? అంటే.. ఇప్పట్లో షూటింగులు స్టార్ట్ చేసి రిస్కులో పడలేం అన్నట్టుగానే ఉంది. కోవిడ్ వల్ల సెట్లో ఎవరికైనా ఒకరికి సోకినా దాదాపు 20-30 మందిని క్వారంటైన్ కి పంపేయాలి. దానివల్ల తీవ్ర నష్టం తప్పదు. పైగా అందరికీ కరోనా టెస్టులు చేయించే బరువు.. సెట్లో జాగ్రత్తల అదనపు భారం కూడా నిర్మాతదే. అందుకే ఈ రిస్క్ తీసుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. అదొక్కటేనా.. అధిక వడ్డీ భారం అనేది ఎప్పుడూ సమస్యనే. అప్పులు తెచ్చి సినిమాలు తీస్తే ఆనక వడ్డీల బాదుడు అంతే సీరియస్ గా ఉంటుంది. మూడు నెలల మారటోరియంకి ఫైనాన్షియర్లు ఒప్పుకున్నా.. సెట్స్ కెళ్లిన దగ్గర నుంచి రిలీజ్ వరకూ అధిక వడ్డీలే బాదుతారు. అందుకే ఇప్పుడే షూటింగు మొదలెట్టే ఆలోచనను విరమించుకున్నారు. వెయిట్ అండ్ వాచ్ పద్ధతినే అనుసరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.