ఇన్నాళ్లు షూటింగుల్లేక అంతా ఖాళీగా ఉన్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి పెద్దరికంతో షూటింగులకు అనుమతులు లభించాయి. ఇక అంతా సెట్స్ కెళ్లడమే అనుకుంటుండగా.. ఇంతలోనే మహమ్మారీ టాలీవుడ్ కి వార్నింగ్ బెల్ మోగించింది.
సెట్స్ కొస్తే కరుస్తానంటోంది కరోనా! ఇప్పటికే బుల్లితెర సీరియళ్ల షూటింగులు మొదలయ్యాయి. దీంతో సెట్స్ లో ఉన్న సీరియళ్ల స్టార్లు కరోనా భారిన పడుతుండడంతో ఒకటే అల్లకల్లోలంగా ఉంది. నిన్ననే టీవీ నటుడు ప్రభాకర్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందన్న వార్త రావడంతో ఒకటే కలకలం. అతడు ప్రస్తుతం సూర్య కాంతం అనే సీరియస్ సహా వేరొక సీరియల్ లోనూ నటిస్తున్నాడు. దీంతో యూనిట్ సభ్యులందరినీ క్వారంటైన్ కి పంపించారు. అంతకుముందు బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబాన్ని ఆయన కాంటాక్టులో ఉన్న వారిని అందరినీ క్వారంటైన్ కి తరలించేశారు. కరోనా టెస్టులు చేశారు.
ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ఓ హీరో తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అది కాస్తా మరింతగా కంగారు పెట్టింది. అదృష్టవశాత్తూ ఆ హీరోకి కరోనా నెగెటివ్ అని తేలింది. అయితే కారణం ఏదైనా కానీ ప్రస్తుత సన్నివేశం చూస్తుంటే షూటింగులకు వెళితే ముప్పు మరో లెవల్లో ఉంటుందని ప్రూవ్ అయ్యింది. మరోవైపు బుల్లితెర షూటింగులు ఆపేయాలంటూ టీవీ ఆర్టిస్టుల సంఘం ఇప్పటికే డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. ఆ మేరకు నిర్మాతలతో మంతనాలు సాగించేందుకు సిద్ధమవుతోందట. ఈ నేపథ్యంలో త్వరలో సెట్స్ కి వెళ్లాలనుకుంటున్న హీరోలు మళ్లీ పునరాలోచించుకునేలా చేశాయి ఈ ఘటనలు. ఇప్పటికే క్రైసిస్ లో ఉన్న టాలీవుడ్ ని కరోనా ఓ రేంజులోనే ఆటాడేసుకుంటోంది. ఇంకా ఎన్నాళ్లు ఆడుతుంది? అన్నది చెప్పలేని పరిస్థితి. కరోనాకి మందు కనిపెట్టామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నా వాటి రిజల్ట్ ఎలా ఉండనుంది? అన్నది తేలాల్సి ఉందింకా.