ప్రముఖ హాస్య నటుడు అలీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు ధృవీకరించాయి. ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియబోతోంది. ముగింపు నాడు నిర్వహించే భారీ బహిరంగ సభలో అలీ.. జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీ కండువా కప్పుకొంటారు.
ప్రముఖ నటుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌కు అలీ ఆప్తమిత్రుడు. పవన్ కల్యాణ్ నటించిన దాదాపు ప్రతి సినిమాలోనూ అలీ కీ రోల్ చేశారు. వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికీ- తాను జనసేన పార్టీలో చేరినట్టు ఏనాడూ అలీ ప్రకటించలేదు. పాదయాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఆయన ఇటీవలే కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
అలీ.. జగన్‌తో భేటీ కావడాన్ని జనసేన పార్టీ అభిమానులు సహించలేకపోయారు. అలీని బూతులు తిడుతూ పోస్టులు పెట్టారు. దీన్ని పవన్ కూడా ఎక్కడా ఖండించిన దాఖలాలు లేవు. తన అభిమానులనూ ఆయన వారించలేదు. దీనితో అలీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారనేది ఫిల్మ్‌నగర్ టాక్.
ఇదిలావుండగా- అలీ వైఎస్ఆర్ సీపీలో చేరడం ప్లస్ పాయింట్‌గానే చెప్పుకోవచ్చు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే జగన్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. నటులు పోసాని కృష్ణమురళి, పృథ్వీ, భానుచందర్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. జగన్‌కు మద్దతు పలికారు. అదే క్రమంలో- టాప్ కమేడియన్, మైనారిటీ వర్గానికి చెందిన అలీ వైఎస్ఆర్ సీపీలో చేరడం ఆ పార్టీకి మరింత బలాన్ని ఇచ్చినట్టవుతుంది.