చిరు ఓటు త‌మ‌న్నాకు.. చెర్రీ ఓటు జాన్వీకి

ప్ర‌తి విష‌యంలోనూ డాడీ మాట‌కు ఎదురు చెప్ప‌ని చ‌ర‌ణ్ ఈసారి ఎందుక‌నో వ్య‌తిరేకంగా చెబుతున్నాడ‌ట‌. అది కూడా హీరోయిన్ విష‌యంలో. చిరుకు న‌చ్చిన బ్యూటీ చ‌ర‌ణ్ కి న‌చ్చ‌డం లేదా? అస‌లింత‌కీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏం జ‌రుగుతోంది? అంటే.. వివ‌రాల్లోకి వెళ్లాలి.

ఆచార్య షూటింగ్ ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ఈ మూవీతో పాటు ఇతర పెద్ద చిత్రాల షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై స్పష్టత లేకపోయినా.. దర్శకుడు కోరటాల శివ ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి సీరియ‌స్ గా ఆలోచిస్తున్నార‌ట‌. పెండింగ్‌లో ఉన్న ప్రీ-ప్రొడక్షన్ పనులతో పాటు సినిమా కి సంబంధించిన ఇత‌ర ఎంపికల భారం ఆయ‌న‌పైనే ప‌డింద‌ట‌. త్వ‌ర‌గా చిత్రీక‌ర‌ణ ముగించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ని చేయాల్సి ఉంది కాబ‌ట్టి టెన్ష‌న్ ఫీల‌వుతున్నాడ‌ట‌.

ప్ర‌స్తుతం ఆచార్య క‌థానాయిక‌లు ఎవ‌రు? అన్న చ‌ర్చ సాగుతోంది. కాజల్ అగర్వాల్ చిరు స‌ర‌స‌న నాయిక గా న‌టిస్తుండ‌గా కియ‌రాను చ‌ర‌ణ్ కోసం ఎంపిక చేశార‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. కానీ ముంబైలో కోవిడ్ 19 విల‌య‌తాండ‌వ‌మాడుతుంటే అక్క‌డి నుంచి నాయిక‌ను ర‌ప్పించ‌డం క‌ష్టమ‌వుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. ఆ క్ర‌మంలోనే త‌మ‌న్నాను చ‌ర‌ణ్ స‌ర‌స‌న తీసుకోవాల్సిందిగా చిరు సూచించార‌ట‌. కానీ చ‌ర‌ణ్ మాత్రం జాన్వీతో మంత‌నాలు సాగిస్తున్నాడ‌ని చెబుతున్నారు.  చిరు సూచ‌న‌ను ప‌క్క‌న పెట్టి త‌న‌యుడు ఇలా చేస్తున్నాడా? అంటూ చ‌ర్చ సాగుతోంది. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇంత‌కుముందు చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌చ్చ చిత్రంలో న‌టించింది.

దీపికా పదుకొనే, అనన్య పాండే ఇప్ప‌టికే టాలీవుడ్‌లో తొలి అడుగులు వేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే జాన్వీని ర‌ప్పించే ఆలోచ‌న స‌రైన‌దేన‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే అతిలోక సుంద‌రి వార‌సురాలు జాన్వీని ఒప్పించాలంటే బోనీ క‌పూర్ అడిగే మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆయ‌న భారీ మొత్తం పారితోషికంగా గుంజేయాల‌ని కోట్ చేస్తున్నారట‌. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కూ వెళుతుందో చూడాలి.