గీతా ఆర్ట్స్ 2 అధినేత బన్ని వాసు తనకు సినీఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడని జూనియర్ ఆర్టిస్టు బోయ సునీత ఆరోపించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి తెలుగు ఫిలింఛాంబర్ ఎదుట వినూత్న నిరసనతో హైడ్రామా.. మీడియా ముందు సంచలన ఆరోపణలు వేడెక్కించాయి. సినిమాల్లో ఛాన్సులు ఇప్పించకుండా మోసం చేశారని .. అల్లు అరవింద్ దీనిపై స్పందించాలని బోయ సునీత ఆరోపించారు. ఆ క్రమంలోనే పోలీసులు రంగంలోకి దిగి తనని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పటివరకూ బన్ని వాసు దీనిపై స్పందించలేదు. తాజాగా ఆయన సన్నిహితులు దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు బన్ని వాసుకు నటి బోయ సునీతకు ఏ సంబంధం లేదు. జనసేన పార్టీ ప్రచారంలో భాగంగా కార్యకలాపాల్లో తాను సాయం చేసింది. జనసేనలో చేరాక సినిమా అవకాశాలు రాకపోవడంతో.. సాయపడాల్సిందిగా పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న బన్ని వాసును అడిగింది. ఇప్పుడిలా బ్లాక్ మెయిల్ కి పాల్పడుతోంది.. అంటూ ప్రత్యారోపణలు చేశారు. ఇటీవలే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి తన తండ్రి తో కలిసి వచ్చిన సునీత అతడిని వదిలేసి వెళ్లిపోయిందని అన్నారు. అసలు సునీతతో బన్ని వాసుకు ఏ సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అయితే అసలు ఈ గొడవలో నిజానిజాలేమిటి? బన్నివాసుపై సునీత చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత.. తాను నిజంగానే మోసపోయిందా అన్నది పోలీసులే విచారణలో తేల్చాల్సి ఉంటుంది.