ఇండియా తొలి మ‌హిళాప్ర‌ధాని ఇందిరా గాంధీ బ‌యోపిక్

కొన్ని రోజుల క్రితం ప్రైమ్ వీడియోలో విడుదలైన `శకుంతకాల దేవి` మ‌హిళాద‌ర‌ణ‌తో విజ‌య‌వంతంగా ర‌న్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాల‌న్ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల‌ ప్ర‌శంస‌లతో పాటు అభిమానుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. దివంగత గణిత శాస్త్రజ్ఞురాలు శ‌కుంత‌లాదేవి నిజ జీవిత పాత్ర‌లో న‌టించి మ‌న‌సుల్ని గెలుచుకుంది.

ఇదే కాకుండా, విద్యా కొన్ని క్రేజీ బయోపిక్స్ లోనూ న‌టించింది. వాటిలో ఒకటి భార‌త‌ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా నిర్మించిన చిత్రం. ఈ చిత్రాన్ని విద్యా భర్త ఆదిత్య రాయ్ కపూర్ నిర్మించాల్సి ఉంది. చాలా కాలంగా దీనిపై ఆస‌క్తిక‌ర ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు ఈ చిత్రం వాయిదా పడిందని తెలుస్తోంది.

భార‌త‌దేశ మొట్ట‌మొద‌టి మ‌హిళా ప్ర‌ధాని ఇందిరా గాంధీపై సినిమా అంటే అది స‌వాళ్ల‌తో కూడుకున్న‌ది. పైగా ఎంతో జాగ్ర‌త్త అవ‌స‌రం. అందుకే ఈ చిత్రానికి చాలా పరిశోధనలు అవసరమని.. దీనికి సమయం పడుతుందని విద్యా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సంవత్సరం చివరలో ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల్సి ఉండ‌గా కరోనావైరస్ అన్నిటినీ తలకిందులు చేసింది. 2021 లో మాత్రమే బయోపిక్ సెట్స్ కెళ్లే వీలుంద‌ని విద్యా చెప్పారు.