భారత ప్రజాస్వామ్యంలో 1975లో విధించిన ఎమర్జెన్సీకి ఈ రోజుతో 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 25, 2025న తన స్పందనను సోషల్ మీడియా వేదిక ‘X’లో పంచుకున్నారు. ఎమర్జెన్సీ అనేది కేవలం ఒక నిర్ణయం కాదు, అది భారత రాజ్యాంగంపై చేసిన దాడి అని తీవ్రంగా విమర్శించారు.
ఎమర్జెన్సీ విధించబడిన నాటి పరిస్థితులను ఆయన సంవిధాన హత్యగా అభివర్ణించారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛలు ఆ కాలంలో నాశనమయ్యాయని మండిపడ్డారు. నేడు ఈ రోజును దేశవ్యాప్తంగా సంవిధాన్ హత్యా దివస్గా గుర్తించాలి అంటూ ప్రజలను అలర్ట్ చేశారు.
ఆ సమయంలో ఎన్నో గొప్ప వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు నిర్భయంగా నిలబడ్డారని మోదీ అన్నారు. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, సామాన్యులు అందరూ కలసి అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి గొప్ప పోరాటం చేశారన్నారు. అలాంటి ధైర్యవంతులకు నా వందనాలు అని ప్రధాని ట్వీట్‌లో పేర్కొన్నారు.
అంతేకాదు, అప్పటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజాస్వామ్యాన్ని అరెస్టు చేసింది అని వ్యాఖ్యానించారు. ప్రెస్ స్వేచ్ఛను అణచివేయడం, ప్రజల స్వాతంత్రాన్నికాలరాయడం వంటి చర్యలు ఎమర్జెన్సీ నాటి పాలనను ఎలా నాశనం చేశాయో ఆయన తిప్పి చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు పోరాడిన వ్యక్తుల త్యాగాల ఫలితంగా దేశం మళ్లీ గాడిలో పడిందని, రాజ్యాంగంలోని విలువలను బలోపేతం చేసుకోవాలన్న దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరి కలలు నెరవేర్చే బాధ్యత నాపై ఉందని ప్రధాని చెప్పారు.
ఈ నేపథ్యంలో, తాను ఆ రోజుల్లో ఎమర్జెన్సీని అనుభవించిన విధానాన్ని, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా చేసిన తన ప్రయాణాన్ని వివరించేందుకు ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ అనే పుస్తకాన్ని త్వరలో తీసుకురాబోతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ పుస్తకం ప్రజాస్వామ్యం విలువలపై కొత్త తరం మనుగడకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.