సినీ నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ నిర్మాత.. రాజకీయనాయకుడు పారిశ్రామిక వేత్త పీవీపీ తనని లేపేస్తానని వార్నింగ్ ఇచ్చారని ఓ లేఖ పూర్వక ఫిర్యాదును ఇవ్వడం తాజాగా సంచలనమైంది. ట్విట్టర్ వేదికగా బండ్ల పలు సంచలన ట్వీట్లు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) తనను లేపేస్తానని హెచ్చరించారని ఆయన ఆఫీస్ వ్యక్తి ఒకరు తనకు ఫోన్ చేశారని ఆరోపించారు. తనకు రక్షణ కల్పించాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
టెంపర్ సినిమా వివాదంలో పీవీపీ తో బండ్ల ఘర్షణ తెలిసిందే. తనకు బండ్ల ఇవ్వాల్సిన బకాయి ఇవ్వలేదని .. నిన్న రాత్రి తన ఇంటిపై గణేశ్ దాడి చేశారని ఆరోపిస్తూ పీవీపీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే బండ్ల సైతం జూబ్లీ పీఎస్ లో కేసు ఫైల్ చేశారు. దాంతో పాటే ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి చిత్రపరిశ్రమలో అందర్నీ పీవీపీ బెదిరిస్తున్నారని.. దయచేసి కట్టడి చేయండంటూ జగన్ ని ఉద్ధేశిస్తూ ట్వీట్లు చేశారు.
“రాజన్న రాజ్యం వచ్చిందని ఆనందంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇలాంటి దుర్మార్గుడిగా చేతినుంచి కాపాడండి సార్“
“ఓడిపోయిన కేసులు కూడా మళ్లీ డబ్బులు కావాలి అని బెదిరించి మాట్లాడితే ఆంధ్ర ప్రదేశ్ నా చేతుల్లో ఉంది మీ అందర్నీ చంపేస్తాను అంటున్నాడు“ ..
“అందరూ ఆంధ్రప్రదేశ్లో అవినీతి లేని పాలన జరుగుతుందని ఆనంద పడుతూ ఉంటే తులసివనంలో గంజాయి మొక్కలు వీరు చేస్తున్న క్రమంలో మీ పార్టీకి నీకు చెడ్డ పేరు వస్తుంది“ అని గణేష్ వరుస ట్వీట్లు చేశారు. టెంపర్ సినిమా ఆర్థిక వ్యవహారాల్లో వచ్చిన తేడా ఈ వివాదానికి కారణమైందని అర్థమవుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రస్తుతం సినీవర్గాల్లో కలకలం రేపుతోంది.