పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ ఒక సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో గబ్బర్ సింగ్ తో పాటు తీన్‌మార్ సినిమాలని పవన్ కళ్యాణ్ తో నిర్మించిన బండ్ల గణేష్ హ్యాట్రిక్ సినిమా కి సిద్దమవుతున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో చెపుకుంటున్నారట. అయితే ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు వహిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. కాగా అందరూ ఈ సినిమాకి దర్శకత్వం వహించేది త్రివిక్రం శ్రీనివాస్ లేదా హరీష్ శంకర్ అని భావించారు.
కాని తాజా సమాచారం ప్రకారం దర్శకుడెవరన్నది ఇంకా తెలియనప్పటికి రచయిత మాత్రం కోన వెంకట్ అని తెలుస్తోంది. కోన వెంకట్ ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలకి కథ అందించాడు. అలాగే నిర్మాతగాను కొనసాగుతున్నాడు. ఇండస్ట్రీలో కోన వెంకట్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇటీవలే అనుష్క శెట్టి నటించిన భారీ మల్టీస్టారర్ కి కథ అందివ్వడమే కాకుండా నిర్మాతగాను వ్యవహరించారు. ఇక కరణం మల్లీశ్వరి సినిమాని పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా కూడా కోన వెంకట్ ప్రకటించాడు.
కాగా ఇప్పుడు బండ్ల గణేష్ – పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ కి కోన వెంకట్ కథ అందివ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కథ బండ్ల గణేష్ కి కోన వెంకట్ వినిపించినట్టు అది గణేష్ కి బాగా నచ్చడం తో త్వరలో కోన ని పవన్ ముందు కూర్చోబెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇక కోన రాసిన కథ ప్రకారం ఈ సినిమాలో పవన్ లెక్చరర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఇలాంటి పాత్ర పోషించలేదు. కాబట్టి అభిమానులు, ప్రేక్షకులకి ఈ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. మరి పవన్ కి కథ నచ్చుతుందా లేదా చూడాలి.