వైజాగ్‌లో ఫిలింస్టూడియో ఆశ చావ‌లేదా బాల‌య్యా?!

సీఎం జ‌గ‌న్ కి ఓకే అయితే నాకు ఓకే 

వైకాపా ప్ర‌భుత్వం అనుమ‌తిస్తే.. సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎలాంటి భేష‌జానికి పోక‌పోతే వైజాగ్ టాలీవుడ్ నిర్మాణానికి నేను సైతం అంటూ ముందుకొస్తాన‌ని బాల‌య్య మ‌నసులో మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. ఇటీవ‌ల ష‌ష్ఠిపూర్తి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఓ ప్ర‌ముఖ తెలుగు వార్తా చానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న చేసిన వ్యాఖ్య ఈ విషయాన్ని స్ప‌ష్ఠం చేసింది. ముఖ్యంగా వైజాగ్ లో ఫిలింస్టూడియో నిర్మాణంపై ఆయ‌న ఆశ‌లు ఇంకా స‌జీవంగానే ఉన్నాయ‌ని ఆ ఇంట‌ర్వ్యూ స్ప‌ష్టం చేసింది.

గ‌త ప్ర‌భుత్వంలో ఫిలిండెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ (ఎఫ్‌డీసీ)కి ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నాను. అనుమ‌తులు ల‌భించాయి. ఇప్ప‌టికీ ఆస‌క్తిగానే ఉన్నాను. ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తిస్తే వైజాగ్ లో స్టూడియో క‌డ‌తాను! అని బాల‌య్య అన్నారు ఆ ఇంట‌ర్వ్యూలో. దీనిని బ‌ట్టి ఆయ‌నకు ఇంకా ఆశ అయితే ఉంది. కానీ ప్ర‌త్య‌ర్థి అయిన బాల‌య్య‌కు సీఎం జ‌గ‌న్ అనుమ‌తిస్తారా? వైకాపా ప్ర‌భుత్వం ఆయ‌న ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్ల‌కుండా స్వాగ‌తం ప‌లుకుతుందా? అంటే సందేహ‌మే.

ఇక వైజాగ్ టాలీవుడ్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న‌తో పాటు మ‌రో టాలీవుడ్ పిల్ల‌ర్ గా భావించే కింగ్ నాగార్జున నుంచి పూర్తి మ‌ద్ధ‌తు ఉంది. అలాగే మూడో పిల్ల‌ర్ విక్ట‌రీ వెంక‌టేష్-డి.సురేష్ బాబు బ్ర‌ద‌ర్స్ మ‌ద్ధ‌తు ఉంది. అయితే నాలుగో పిల్ల‌ర్ అయిన బాల‌య్య‌కు మాత్రం ఆ ఛాన్స్ లేద‌నే భావించాల్సి వ‌స్తోంది. మ‌రి ఏపీ పాలిటిక్స్ మునుముందు ఎలా మార‌నుందో చూడాలి.

ఓవైపు వైజాగ్ రాజ‌ధాని నిర్మాణం స‌హా అక్క‌డే మ‌రో టాలీవుడ్ నిర్మాణానికి సంక‌ల్పించిన వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై విశాఖ న‌గ‌ర‌వాసులు స‌హా ఉత్త‌రాంధ్ర బెల్ట్ నాలుగు జిల్లాలు ఎంతో హోప్ తో ఉన్నాయి. విశాఖ‌లో టాలీవుడ్ నిర్మాణానికి అమ‌రావ‌తి స‌హా అన్ని చోట్ల నుంచి నాయ‌కులు, ప్ర‌జ‌ల‌ మ‌ద్ధ‌తు ఉండ‌నే ఉంది.