కశ్మీర్ పీవోకేలో ఉగ్రవాదుల్ని ఏరివేసేందుకు భారత వైమానిక దళం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఆసక్తికర చర్చ సాగింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారతీయ వైమానిక దళం- ఆర్మీ ఊహించని మెరుపు దాడులు చేసింది. ఆ దెబ్బకు పాకిస్తాన్ బిత్తరపోయింది. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ఆపరేషన్ ని అంత పెద్ద సక్సెస్ చేసిన టీమ్ కి దేశవ్యాప్తంగా ప్రజలు సెల్యూట్ చేశారు. ఇదే కథతో బాలీవుడ్ లో తెరకెక్కించిన `యూరి: ది సర్జికల్ స్ట్రైక్స్` సంచలన విజయం సాధించింది. విక్కీ కౌశల్ కథానాయకుడిగా ఆదిత్యధర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 350 కోట్ల వసూళ్లు సాధించింది.
`యూరి` సాధించిన సక్సెస్ చూశాక ఆ తరహాలో దేశభక్తిని రగిలించే మరిన్ని చిత్రాల్ని తెరకెక్కించేందుకు పలువురు నిర్మాతలు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలాకోట్ వైమానిక దాడుల నేపథ్యంపైనా పలువురు కథల్ని రెడీ చేయిస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా పుల్వామా జిల్లాలోని బాలాకోట్ దాడులు.. ఆ దాడుల్లో శత్రువుకు చిక్కి తిరిగి క్షేమంగా ఇండియాకు చేరుకున్న వింగ్ కమాండర్ అభినందన్ జీవితంపై సినిమాని తెరకెక్కించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబేరాయ్ సన్నాహాలు చేస్తున్నారు. ఆయన నిర్మించే ఈ సినిమాకి `బాలాకోట్: ది ట్రూ స్టోరీ` అనే టైటిల్ ని నిర్ణయించారు. జమ్ము కశ్మీర్, దిల్లీ, ఆగ్రాలో పలు లొకేషన్లలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. ఈ ఏడాది చివరిలో సినిమాని ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో కథానాయకుడిగా ఎవరు నటిస్తారు.. దర్శకుడెవరు తదితర వివరాలు తెలియాల్సి ఉంది. ప్రేక్షకుల్లో చైతన్యం నింపే దేశభక్తి ప్రధాన చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. యూరి 350 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు అదే తరహాలో ఎమోషన్ ని రగిలించే కథతో `బాలాకోట్` చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఏ స్థాయిలో రూపొందించనున్నారు? అన్నది చూడాలి.
ఒబెరాయ్‌ని పీఎం నరేంద్రమోదీ పూనాడా?
ఇకపోతే బాలాకోట్ ఎయిర్ ఎటాక్స్ నేపథ్యంలో ఒబేరాయ్ కంటే ముందే పలువురు నిర్మాతలు సినిమాలు తీసేందుకు రెడీ అయ్యారని వార్తలు వచ్చాయి. ఒక్కొక్కరూ ఒక్కో తరహాలో కథలు రాసుకుని సినిమాలు తీసేందుకు రెడీ అవుతున్నారని ముంబై ఫిలింఛాంబర్ లో పదుల సంఖ్యలో టైటిల్స్ రిజిస్టర్ చేయించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే స్వతహాగానే దేశభక్తుడు అయిన వివేక్ ఒబేరాయ్ వీళ్లందరికంటే ఒక మెట్టు పైనే ఉన్నాడు. కాస్త ముందుగానే ఆ ప్రయత్నాల్లో ఉన్నారని అర్థమవుతోంది. ఒబేరాయ్ ఇదివరకూ ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ `పీఎం మోదీ`లో నటించిన సంగతి తెలిసిందే.