స్నేహితుడిపై ప్రేమతో 350 కోట్లు పెట్టారా?
తెలుగు సినీపరిశ్రమకు 100కోట్ల బడ్జెట్ అన్నదే ఒకప్పుడు బిగ్ ఛాలెంజ్. కానీ ఇప్పుడు గోల్ అంతకంతకు పెద్దదవుతోంది. 100 కోట్ల షేర్.. 200 కోట్ల గ్రాస్ వసూలు చేస్తున్నాయి మన సినిమాలు. 100 కోట్ల నుంచి 350 కోట్ల వరకూ బడ్జెట్లతో సినిమాలు తీశారు. ప్రభాస్- రాజమౌళి- ఆర్కా మీడియా కాంబినేషన్ లో తెరకెక్కించిన బాహుబలి 1,2 చిత్రాల కోసం 400 -500 కోట్ల మేర బడ్జెట్ ని ఖర్చు చేశారు. ఇప్పుడు ప్రభాస్-సుజీత్- యు.వి.క్రియేషన్స్ కాంబినేషన్ లో వస్తున్న `సాహో` కోసం ఏకంగా 350 కోట్ల బడ్జెట్ ని కేటాయించారు. ఒక టాలీవుడ్ సినిమాకి ఇంత పెద్ద బడ్జెట్లు పెట్టడం అన్నది అనూహ్యమైన పరిణామం. అందుకు గట్స్ ఉండాలి. గుండెల నిండా దమ్ముండాలి. ఇదే విషయాన్ని సాహో ఈవెంట్ ఆద్యంతం పరిశ్రమ పెద్దలు ప్రస్థావించారు. యు.వి.క్రియేషన్స్ నిర్మాతలు ప్రమోద్-వంశీలకు పులులు – సింహాలకు ఉండే గుండె ఉంది అంటూ అల్లు అరవింద్, దిల్ రాజు, వినాయక్ లాంటి ప్రముఖులు ప్రశంసించారంటే అర్థం చేసుకోవాలి.
<
p style=”text-align: justify”>నిజమే 350 కోట్ల బడ్జెట్ పెట్టాలంటే అది సాహసోపోతమైన చర్య. కోటి అన్న పదం ఊహించేందుకే సామాన్యుడికి ఊపిరాడదు. అలాంటిది ప్రభాస్ అనే ఫ్రెండు కోసం నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీ బృందం అంత ఖర్చు చేశారు. ఇది స్నేహానికి వీళ్లు ఇచ్చిన విలువ అన్నది సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ సాక్షిగా అందరికీ అర్థమైంది. ఇదొక్కటే కాదు తెలుగు సినిమా బడ్జెట్ రేంజ్ 1000 కోట్లు, 2000 కోట్ల రేంజుకు పెరగాలని వినాయక్ ఆకాంక్షించారు. ప్రభాస్ ఆ రేంజుకు తీసుకెళతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. మునుముందు సీన్ చూస్తుంటే ఆ స్థాయికి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. విలక్షణ నటుడు ఉలగనాయగన్ కమల్ హాసన్ ఒక మాటన్నారు. ఆస్కార్ ల కోసం మనం వెళ్లకూడదు. మనల్నే వెతుక్కుంటూ ఆస్కార్ లు రావాలి. ఆస్కార్ లను మించిన అవార్డుల్ని మనమే సృష్టించాలని. నిజమే ఆ స్థాయిని దక్షిణాది సినిమా అందుకుంటుందనే ఆకాంక్షిద్దాం. కమల్ హాసన్ తలచినది టాలీవుడ్ దర్శకనిర్మాతలు సాధించే సన్నివేశం మునుముందు ఉండాలనే ఆశిద్దాం. ప్రస్తుతం అల్లు అరవింద్ 500 కోట్ల బడ్జెట్ తో రామాయణం తీస్తున్నారు. ఇది తెలుగు సినీపరిశ్రమలో మరో అసాధారణ బడ్జెట్. అత్యంత సాహసోపేతమైన ప్రయత్నమే. అయితే ఆ రేంజు బిజినెస్ చేసే సత్తా బాస్ అరవింద్ కి ఉంది. మార్కెటింగ్ లో సుదీర్ఘమైన అనుభవం ఉన్న గొప్ప నిర్మాత అల్లు అరవింద్. బాలీవుడ్ లో ఆరోజుల్లోనే 50 కోట్ల బడ్జెట్ తో గజిని
చిత్రాన్ని నిర్మించిన గట్స్ అరవింద్ కు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. మునుముందు టాలీవుడ్ లో ఉన్న బడా నిర్మాణ సంస్థలు బడా బడ్జెట్లు పెట్టి ఇంకా భారీ చిత్రాలు నిర్మించేందుకు ఆస్కారం లేకపోలేదు. 1000 కోట్లు, 2000 కోట్ల బడ్జెట్ రేంజుకు ఎదగాలని వినాయక్ ఆకాంక్షించినట్టే మన నిర్మాతలు అలాంటి సాహసాలు చేయకపోతారా? అంటే చేసేందుకు ఆస్కారం లేకపోలేదు. అందుకు జాతీయ అంతార్జాతీయ స్థాయి నిర్మాణ సంస్థలతో టై అప్ లు పాజిబిలిటీస్‌ని పెంచుతాయనే భావించవచ్చు. బాహుబలి తర్వాత ఆ స్థాయి మార్పు తెలుగు సినీపరిశ్రమలో.. దక్షిణాది పరిశ్రమల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తాడిని తన్నేవాడొకడుంటే తలదన్నేవాడొకడు పుట్టుకొస్తాడన్నది సామెత. అది నిజమై తీరాలి.