అడవిలో చిక్కుకుపోయిన అమలాపాల్

కంగారుపడకండి..నిజ జీవితంలో ఆమె ఏమీ అడవిలో చిక్కుకుపోలేదని కానీ, అడవి నేఫధ్యంలో జరిగే ఓ సినిమాకు కంటిన్యూగా డేట్స్ ఇచ్చి…అడవిలోనే జీవితం గడిపిన ఫీలింగ్ వచ్చిందని, నిజంగానే తాను అడవిలో చిక్కుకుపోయానా అనిపించిందని అమలాపాల్ అలవోకగా తన తాజా చిత్రం గురించి ప్రమోట్ చేస్తూ చెప్పేస్తోంది. ఇంతకీ ఆ సినిమా పేరు ఏమిటి అంటే..‘అదో అంద పరవై పోల’.

పూర్తి వివరాల్లోకి వెళితే… సెంచురి ఇంటర్నేషనల్‌ ఫిలిమ్స్‌ బ్యానరుపై జోన్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘అదో అంద పరవై పోల’. కేఆర్‌ వినోద్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అమలాపాల్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అడ్వెంచర్‌, థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కేరళ, కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కథేంటంటే..

ప్రముఖ యువ వ్యాపారవేత్త అయిన నటి అమలాపాల్‌ కారడవుల్లో చిక్కుకుంటుందన్నారు. అక్కడ నుంచి ఆమె ఎలా బయటపడుతుందన్నదే చిత్ర కథ అని తెలిపారు. అడవుల్లో చిక్కుకున్న అమలాపాల్‌ ఎలాంటి కష్టాలు పడుతుండి? అడవి మృగాలు, అడవి మనుషుల బారిన పడి ఎలా తప్పించుకుంటుంది లాంటి కథ, కథనాలతో ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రం ఇది .

ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘గతంలో నా దర్శకత్వంలో వచ్చిన ‘తమిళుక్కు ఎన్‌ ఒండ్రై అళుత్తవుం’ మంచి గుర్తింపు సాధించింది. ఇప్పుడు అమలాపాల్‌తో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇందులో ఆశిష్‌ విద్యార్థి అటవీశాఖ అధికారిగా నటించారు. సబీర్‌కొచ్చర్‌ కీలకపాత్ర పోషించారు. సినిమాలో చాలా వరకు సన్నివేశాలను సింగిల్‌ షాట్‌లోనే తెరకెక్కించాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం హైలెట్‌గా ఉంటుందని’ పేర్కొన్నారు.

ఈ చిత్రానికి శరత్‌కుమార్‌ ఛాయాగ్రహణం, జాక్స్‌ బిజాయ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. అరుణ్‌ రాజగోపాలన్‌ కథ, స్క్రీన్‌ సమకూర్చి మాటలు రాశారు.