సినిమా ఈవెంట్లు క్యాన్సిల్.. కొవిడ్ 19 పుణ్య‌మే ఇది‌!!

సినిమా రిలీజ‌వుతోంది అంటే భ‌జ‌న ఈవెంట్ల హోరు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అందునా సినిమా వాళ్ల భ‌జ‌న‌లు భ‌జంత్రీలు అంత తేలిగ్గా తెమిలేవి కావు. ఏదో ప్రెస్ మీట్ అంటే అర్థ‌గంట‌.. గంట‌లో తేలిపోతుంద‌ని ఆశ‌ప‌డుతుంటారు మీడియా వాళ్లు. కానీ పూట‌ల‌కు పూట‌లు అదేదో సంత‌ర్ప‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగిన‌ట్టో పెళ్లి వేడుక చేస్తున్న‌ట్టో రాచి రంపాన పెడుతుంటారు. ఇందులో ఏవీలు (యాంక‌ర్ విజువ‌ల్స్) అంటూ సినిమా యూనిట్ లో హీరో హీరోయిన్ దర్శ‌క‌నిర్మాత‌ల‌పై భ‌జ‌న కోస‌మే బోలెడంత స‌మ‌యం వృధా చేయ‌డ‌మే గాక‌.. అటుపై డ్యాన్సులు.. మిమిక్రీలు.. పాట‌లు పాడ‌టాలు అంటూ పూటంతా ఒక‌టే న‌స పెట్టేస్తారు. అయినా మౌనంగా భ‌రిస్తూ మీడియా వాళ్లు చివ‌రి ఐదు నిమిషాలు ఏం మాట్లాడుతారా? అని క‌ళ్లు కాయ‌లు కాసేలా వేచి చూస్తుంటారు.

ఎప్పుడో ఓసారి టీవీలు చూసేవాళ్ల‌కు అప్ప‌డ‌ప్పుడు ప్రెస్ మీట్ ఎలా ఉందో చూసేవాళ్ల‌కు అయితే ఓకే కానీ అనునిత్యం ఇదే భ‌జ‌న చూడాలంటే మీడియా వాళ్ల‌కు ఎంత బోరింగ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నే లేదు. అయితే క‌రోనా(కొవిడ్ 19) పుణ్య‌మా అని ఈ భ‌జంత్రీ కార్య‌క్ర‌మానికి ఇక సెల‌వ్‌ అని చెబుతున్నారు బాహుబ‌లి నిర్మాత ఆర్కా అధినేత శోభు యార్ల‌గ‌డ్డ‌.

కొవిడ్ దెబ్బ‌కు ప్ర‌మోష‌న్ తీరు తెన్నులు మారిపోతాయ‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నారాయ‌న‌. “కొవిడ్ 19 తర్వాత ఫిల్మ్ మార్కెటింగ్ ఎలా ఉండబోతోంది? ప్రత్యేకించి టాలీవుడ్ లో మార్కెటింగ్ ఎలా మారుతుందో అని ఆశ్చర్యపోతున్నా. ప్రీ-రిలీజ్ వేడుకలు.. ఆడియో విడుదల కార్యక్రమాలు థియేటర్స్ మాల్స్ కి వెళ్లడాలు.. రోడ్ ట్రిప్ లు…. ఇలాంటివి ఇకపై ఉండవు. సినిమా కార్యక్రమాలను నిర్వహించడం కుదరదు. డిజిటల్ మార్కెటింగ్ ఆన్ లైన్ సంభాషణలు ఎక్కువవుతాయి“ అని తాజా ట్వీట్ లో తెలిపారు.

ఎంత బాగా చెప్పారు శోభు గారూ! మంచిదేగా.. అయినా ఇవ‌న్నీ కావాల‌ని మీడియా వాళ్లు ఏనాడైనా అడిగారా? ఇది కేవ‌లం శోభు యార్ల‌గ‌డ్డ ఉద్ధేశ‌మే కాదు. ఆ న‌లుగురు లేదా ఆ ప‌ది మంది యాక్టివ్ నిర్మాత‌ల కోరిక కూడా ఇదే. ప్ర‌తిదానికి క‌వ‌రేజీ పేరుతో మీద ప‌డే మీడియాని ఇన్నాళ్లు ఎంతో క‌ష్టంగా భ‌రించేశారు. భ‌జ‌న భ‌జంత్రీ మీడియాల్ని ఓపిగ్గా భ‌రించారు పాపం. అందుకే ఇక‌పై క‌రోనా పుణ్యామా అని అవేవీ లేక‌పోతే ఎంతో బావుంటుంద‌ని వీరంతా భావిస్తున్నారు.

అంతెందుకు అస‌లు ఈ మాయ‌దారి మీడియాని పూర్తిగా బ్యాన్ చేసేస్తే ఇంకా బావుంటుందేమో! ప్ర‌చారం ఏం కావాల‌నుకున్నా… ట్విట్ట‌ర్ లోనో.. ఇన్ స్టాలోనో పోస్ట్ చేస్తే స‌రిపోతుంది. అయినా ప్ర‌తి అగ్ర నిర్మాణ సంస్థ‌కు సొంతంగా యూట్యూబ్ చానెళ్లు ఉన్నాయి. వాటిలో ప్ర‌మోష‌న్ చేసుకుంటే స‌రిపోతుంది క‌దా? ప్ర‌తిదానికి మీడియాని పిలిచి భ‌జ‌న చేయ‌డం ఎందుక‌ని? అన‌వ‌స‌రంగా అంద‌రి టైమ్ వేస్ట్. ఇంత‌కుముందు మీడియాకి మెయిల్స్ లో స‌మాచారం పంపించేవారు. అది కూడా ఇక అవ‌స‌రం లేదు. ప్ర‌తిదీ సొంత చానెళ్ల‌లో వేసుకుంటే స‌రిపోతుంది.

అన్న‌ట్టు ఇటీవ‌లి కాలంలో ఏవో మూడు నాలుగు ప్ర‌ధాన మీడియాల్ని త‌ప్ప ఇత‌రుల‌కు పిలుపు కూడా ఉండ‌డం లేదు ప్రెస్ మీట్ల‌కు. చివ‌రి నిమిషంలో రిలీజ్ ముందు తేదీ చెప్పేందుకు ఆ నాలుగు మీడియాలు వ‌స్తే స‌రిపోతుంద‌ని నిర్మాత‌లంతా భావిస్తున్నారు. అయినా సిగ్గు లేకుండా మీడియాల‌న్నీ వ‌చ్చి మీద ప‌డుతున్నాయి. అందుకే ఇంత‌గా మీడియాపై ఏహ్య భావం కూడా పెరిగిపోయింది ఇండ‌స్ట్రీలో.

అదంతా స‌రే కానీ.. శోభూ యార్లగడ్డ నిర్మిస్తున్న `ఉమామహేశ్వర ఉగ్రరూపస్య` (వెంక‌ట్ మ‌హా ద‌ర్శ‌కుడు) చిత్రానికి మీడియా ప్రెస్ మీట్లు అన‌వ‌స‌రం అని భావిస్తున్నారా? ఆన్ లైన్ లేదా సామాజిక మాధ్య‌మాల ప్ర‌చారం స‌రిపోతుంద‌ని భావిస్తున్నారా? కాస్త ఆగితే కానీ తెలీదు. అయినా కొవిడ్ 19 దెబ్బ‌కు ఇప్పుడంతా ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తున్నారు కాబ‌ట్టి మునుముందు థియేట‌ర్ల అవ‌స‌రం కూడా ఉండ‌దేమో!.. ప్చ్!!