ఉన్న చోటే ఉండండి.. గంజి తాగి పడుకోండి.. గడప దాటొద్దండి.. అని ఊదరగొడుతోన్న నియమాలన్నీ సామాన్యులకే.. పెద్దలకు ఇవేమీ వర్తించవు.. వారు ఇష్టం వచ్చినట్లు తిరగొచ్చు.. జనాన్ని వెంటేసుకుని ర్యాలీలు చేయొచ్చు.. వాటి ఫలితాలు మాత్రం ప్రజలు, అధికారులు అనుభవిస్తారు. ఇప్పుడు ఏపీలో ఇదే కలకలం రేపుతోంది.
అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన పనికి ఇప్పుడు ఓ జిల్లా మొత్తం కష్టపడుతోంది. భారీ ఎత్తున ట్రాక్టర్లతో ర్యాలీ చేసి అప్పటికి అప్పుడు రాష్ట్ర, దేశ వ్యాప్తంగా చర్చ అయ్యారే.. ఇప్పుడు దాని వల్లే.. వైరస్ విస్పోటనం చెంది చిత్తూరు జిల్లాలో పరిస్థితులు చేయి దాటిపోయినట్లు కనిపిస్తోంది. దీనంతిటి కారణం ఒక్క ఎమ్మెల్యే అత్యుత్సాహం.
ఆదాయం లేక సతమవుతోన్న ఆంధ్రప్రదేశ్‌కు కరోనా కష్టంలో సాయం చేసేందుకు దాతలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. తోచిన విధంగా విరాళాలు ఇచ్చారు. సాయం చేశారు. అలా చేసిన వాళ్లకు సన్మానం అంటూ.. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఓ వింత కార్యక్రమం నిర్వహించారు. దాతల ఫొటోలతో ఫ్లెక్సీలు తయారుచేయించి, వాటిని ట్రాక్టర్లపై పెట్టి ఈ నెల 11న పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
సరిగ్గా పదిరోజులు గడిచింది.. చిత్తూరు జిల్లాలో ఒకే రోజు 29 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో ఎక్కువ ర్యాలీతో సంబంధం ఉన్నవే అని తేలింది. ఇక ర్యాలీలో పాల్గొన్న వారు కూడా వందల సంఖ్యలో ఉండటంతో ఇప్పుడు ఇదో మర్కజ్ విషాధంగా మారేలా కనిపిస్తోంది. ర్యాలీలో పాల్గొన్న వారందరినీ కనిపెట్టే పనిలో అధికారులు ఉండగా.. అన్నీ బైటికి వస్తే కేసులు మరింత పెరిగేలా ఉన్నాయి. ఇక ఇప్పటికే జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరుగుతుండగా.. దీని పర్యవసానాలు ఇంకా ఎంత తీవ్రం కానున్నాయో చెప్పలేనిదిగా ఉంది.