అక్కినేనికి ఇష్టమైన ఆ ఒక్క సినిమా !

అక్కినేని నాగేశ్వర రావు నటించిన చిత్రాల్లో ఆయనకు బాగా ఇష్టమైన సినిమా ఎదో తెలుసా?  అక్కినేని 1941 “ధర్మ పత్ని” సినిమాతో నటుడుగా ప్రవేశించాడు . 2014లో ఆయన నటించిన చివరి సినిమా “మనం “

73 సంవత్సరాల్లో ఆయన నటించిన సినిమాలు 244. అయితే వీటిలో ఆయనకు నచ్చిన సినిమాలు చాలానే ఉండొచ్చు. అలాఅడిగితే కనీసం పది సినిమాలు అయినా చెబుతారు. చాలాకాలం క్రితం ఆయనతో మాట్లాడు వున్నప్పుడు ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది .

అక్కినేని తనకు ఇష్టమైన సినిమాల లిస్టు చెప్పడం మొదలు పెట్టారు. “మీకు బాగా నచ్చిన ఒకే ఒక్క సినిమా చెప్పండి “అన్నాను. అయన తడుమోకుండా “బాటసారి ” అని చెప్పారు.

“అదేమిటి చాలామంది మీకు బాగా ఇష్టమైన సినిమా అనగానే ముందు “దేవదాస్ ” అని చెబుతారు. మీరు కూడా అదే సినిమా అంటారనుకున్నా”

“అందరికీ నచ్చింది నాకు కూడా నచ్చవచ్చు. నాకు వ్యక్తిగతంగా నచ్చింది వేరే వారికి  నచ్చక పోవచ్చు”  “కరెక్ట్ .  కానీ బాటసారి ఎందుకు నచ్చిందో చెప్పండి”.

“బాటసారి సినిమా నిర్మించింది భరణీ సంస్థ. ఇది 1961లో  విడుదలైంది. ఇందులో సురేంద్రుడుగా నేను మాధవిగా భానుమతి నటించాము.

దేవదాస్ రచయిత శరత్ బాబు రాసిన నవల ఆధారంగా ఈ సినిమా నిర్మించారు.   అప్పటికే నేను శరత్ బాబు నవలలు చదివాను. నిజానికి సురేంద్రనాథ పాత్రను నేను ధరిస్తానని ఊహించలేదు. ఆ పాత్రను ధరించి మెప్పించడం చాలా కష్టం. భానుమతి గారు ఆ సినిమా తీస్తున్నాము, మీరు సురేంద్రనాథ్ పాత్రకు సరిపోతారని నేను రామకృష్ణగారు  అనుకున్నామని చెప్పారు.

సురేంద్ర పాత్ర నాకు బాగా నచ్చింది. కానీ నేనే పోషించాలని అన్నప్పుడు మాత్రం భయం వేసింది. కారణం సురేంద్ర నాథ్ పాత్ర పోషణ చాల క్లిష్టమైనది. అది అన్ని పాత్రల్లాటిది కాదు. విభిన్నమైన మనస్తత్వం కలిగినది. అందుకే కాస్త తటపటాయించాను. కానీ భానుమతి అసాద్యురాలు. మీరైతేనే  న్యాయం చేయగలరనే నమ్మకం నాకుంది  అన్నారు. అప్పుడు సరే అన్నాను “

“నటించేటప్పుడు మీ అనుభవాలు చెప్పండి “

‘ఆపాత్ర పోషణ కోసం చాలా కష్ట పడ్డాను . సురేంద్రుడు ఒట్టి   అమాయకుడు.  మాధవి బాల్య వితంతువు . పైగా ఘోష . మగవారి నీడ కూడా పడదు . వీరిద్దరి మధ్య గాఢమైన బంధం . సురేంద్రుడు  కనీసం ఒక్కసారి కూడా దగ్గరగా చూడడు , ఇక తాకడం అనే మాటే లేదు . క్లైమాక్స్ లో తప్ప . కానీ మాధవి అనే పేరు సురేంద్రుని మనసులో నిక్షిప్తమై ఉంటుంది . నిజమ్ చెప్పాలంటే వారిది చాలా పవిత్రమైన ప్రేమ . నేను అప్పటికే 80 చిత్రాల్లో నటించాను , కానీ అంత  కష్టం  ఎప్పుడు పడలేదు . సురేంద్రుడు పాత్ర కళ్ళతో తన భావాలను వ్యక్తీకరిస్తుంది . అందుకే చాలా కష్టపదాల్చి వచ్చింది . అయితేనేం చిరస్మరణీయంగా మిగిలిపోయింది ” చెప్పారు అక్కినేని .

బాటసారి సినిమా విడుదలై ఇప్పటికి 57 సంవత్సరాలు .

-భగీరథ