బిగ్ బి అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్లో తెరకెక్కించిన పింక్
ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఈ సినిమాని బోనికపూర్ తమిళంలో నిర్మించారు. అజిత్, శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నేర్కొండ పార్వై
పేరుతో తెరకెక్కి నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే విడుదలకు ముందే పైరసీ చిత్రయూనిట్ ని బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో నిర్మాత బోనీ కపూర్‌లో కంగారు నెలకొందట. అయితే లీకైన సన్నివేశాలు మరీ అంత స్పష్టంగా లేకపోవడం కొంతవరకూ ఊరట. సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు నేపథ్యంలో ప్రస్తుతం ఆ లింకులన్నిటినీ తొలగించే పనుల్లో ఉన్నారు.
ఇంతకీ ఈ లీకులు ఎక్కడ నుంచి? అంటే ఇదివరకూ సింగపూర్‌లో ఓ స్పెషల్ ప్రివ్యూ వేశారు. అలాగే చెన్నయ్ మీడియాకి ఒక ప్రివ్యూ వేశారట. ఎవరో ఔత్సాహిక అభిమాని కొన్ని వీడియో క్లిప్స్ ని మొబైల్ లో చిత్రీకరించి ఇలా ఆన్ లైన్ లో రిలీజ్ చేసేశాడు. అయితే లీకేజీ బెడద ఇంతటితో ఆగుతుందా? అంటే ఎలానూ తమిళ్ రాకర్స్ బెడద ఉండనే ఉంది. వీళ్లను ఎదుర్కోవడం ఎవరి తరమూ కాదు. అందుకే బోనీకపూర్ ఈ పైరసీ మాఫియాపై కాస్తంత ముందుగానే మేల్కోని కోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది. తమిళరాకర్స్ వెబ్ సైట్‌ని నిలువరించేందుకు కోర్టు నుంచి స్టే ఆర్డర్స్ ని తెచ్చుకున్నారట. అజిత్ నటించిన రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజయ్యాయి. నేర్కొండ పార్వాయ్ చిత్రానికి సమీక్షకుల్లో ఇప్పటికే పాజిటివ్ స్పందన కనిపిస్తోంది. అజిత్ నటనకు మంచి మార్కులే వేశారు.