ఆరు పదుల వయస్సులోను ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందిస్తున్నారు. కరోనా వలన దాదాపు తొమ్మిది నెలలు ఇంటికే పరిమితమైన ఆయన ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. రీసెంట్‌గా ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్ళారు. ఆయనకు అభిమానుల నుండి ఘన స్వాగతం లభించింది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. మే 13న చిత్రం విడుదల కానుండగా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆచార్య తర్వాత చిరంజీవి రీమేక్‌ల బాట పట్టాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్ ను త్వరలో మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చేయనున్నాడు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలోను సినిమా చేయనున్నాడు. ఈ మూడు సినిమాలకు సంబంధించి ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. తాజాగా చిరు మరో రీమేక్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అజిత్ హీరోగా నటించిన ‘ఎన్నై ఎరిందాల్’ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో చిరు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం తెలుగులో ఎంతవాడు కాని పేరుతో విడుదలైనప్పటికీ, తెలుగు నేటివిటీకు అనుగుణంగా మూవీని రీమేక్ చేయాలని అనుకుంటున్నాడట. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం, బోయపాటి శీను దర్శకత్వంలో ఓ చిత్రం, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నట్టు సమాచారం. ప్రశాంత్ వర్మ ఇప్పుడు నాగార్జునతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.