వాలిమై సెట్‌లో అజిత్.. ఇలాంటి స్టంట్స్ చేసి గాయాల‌పాల‌య్యాడా!

త‌మిళ హీరోల‌లో అజిత్‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంది. ఆయ‌న చేసే ప్ర‌తి సినిమాల‌లో ఏదో ఒక వైవిధ్యం చూపించి ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తుంటారు. ఇటీవ‌లి కాలంలో అజిత్ చేస్తున్న సినిమాల‌కి భారీ క్రేజ్ ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో అజిత్ సినిమాలని తెలుగుతో పాటు ప‌లు భాష‌ల‌లో రీమేక్ చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం అజిత్ వాలిమై అనే సినిమా చేస్తుండ‌గా, ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజులుగా హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. దర్శ‌కుడు హెచ్ వినోద్ యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అజిత్‌కు ఎంతో యిష్టమైన బైక్‌ స్టంట్స్ సీన్ చేస్తున్నపుడు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన చేతికి, కాళ్లకు గాయాలయ్యాయి.

అజిత్‌కు ప్రమాదం అయిందని తెలుసుకున్న అభిమానులు ఆందోళ‌న చెందారు. ఆయ‌న ప‌రిస్థితి ఎలా ఉంద‌ని ఆరాలు తీసారు. అయితే అజిత్‌కు పెద్ద‌గా ప్ర‌మాదం ఏం లేద‌ని తెలియ‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా సెట్‌లో అజిత్ స్టంట్స్ చేస్తున్న ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో త‌ల‌కు హెల్మెట్ ధ‌రించిన అజిత్ సింగిల్ వీల్ పైన బండిని పైకి లేపాడు. ఇలాంటి స్టంట్స్ అజిత్‌కు కొత్త కాక‌పోయిన ఒక్కోసారి ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేదు.

షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ‌ప్ప‌టికీ అజిత్ త‌ర్వాత రోజే షూటింగ్‌లో పాల్గొన్న‌ట్టు తెలుస్తుంది. నిర్మాత‌ల బాగోగుల‌ని దృష్టిలో పెట్టుకొని అజిత్ షూటింగ్‌లో పాల్గొన్నాడ‌ట‌. వ‌ర్క్‌పై ఆయ‌న‌కున్న డెడికేష‌న్‌పై చిత్ర బృందం ప్ర‌శంస‌లు కురిపించింది. వాలి మై సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. కాలా బ్యూటీ హుమా ఖురేషి హీరోయిన్‌గా న‌టిస్తుంది. తెలుగు యువ న‌టుడు కార్తికేయ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.