ఇక తెలుగు పైనే దృష్టి!
తెలుగు, హిందీ, తమిళం.. ఇలా అన్ని భాషల్లో చిత్రాలు చేస్తున్ననటి ఆదాశర్మ. క్షణం సినిమా తర్వాత ఎలాంటి చిత్రం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో కల్కి చిత్రం అవకాశం తలుపు తట్టింది. రాజశేఖర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంతవర్మ దర్శకత్వం వహించారు. సి. కళ్యాణ్ నిర్మించిన కల్కి ఇటీవలే ప్రేక్షకుల ముందు కొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదన్న టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో ఆదా శర్మ సీనియర్ హీరో రాజశేఖర్ సరసన ఆడి పాడి అందరి మనసులను గెలుచుకుంది. తొలి సారిగా డాక్టర్ పాత్రలో కనిపించిన ఆదా శర్మ తన నిజ జీవితానికి విరుద్ధమైన పాత్రలో లీనమై నూటికి నూరు పాళ్ళు ఆ పాత్రకు న్యాయం
చేసింది అని చిత్రం చూసిన పరిశ్రమ పెద్దలు, ఆడియన్స్ ఆదాను తెగ మెచ్చుకుంటున్నారట. అందుకు ఎంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్న ఆదా ఈ చిత్రం లోని తన పాత్ర గురించి చెబుతూ- దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన అ సినిమా నాకు బాగా నచ్చింది. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్న నాకు కల్కి సినిమా కథ చెప్పగానే వెంటనే నచ్చేసింది. ఆయన చిత్రాల్లో హీరోయిన్ పాత్రలు విభిన్నంగా ఉంటాయి. ఈ చిత్రంలో కూడా నా పాత్ర అదే స్థాయిలో ఉండడం వల్ల అందరికీ బాగా నచ్చింది. కళ్ల ద్వారానే వ్యక్త పరుస్తూ తక్కువగా మాట్లాడే క్యారెక్టర్ కావడం వల్ల నాకు బాగా పేరు తీసుకు వచ్చింది. అయితే ఈ క్యారెక్టర్ నా నిజ జీవితానికి పూర్తి విరుద్ధం. అందుకే ఈ పాత్రని ఛాలెంజ్ గా తీసుకున్నాను. సీనియర్ హీరో రాజశేఖర్ సరసన వర్క్ చేయడం మరచి పోలేని అనుభూతి- అని చెప్పుకొచ్చింది.
ఇన్ని గొప్పలు చెప్పుకుంటున్న ఆదాను చాలామంది ఆడియన్స్ తెలుగు సినిమాలు ఎక్కువగా ఎందుకు చేయడం లేదని అడుగుతున్నారట? హిందీలో వరుసగా రెండు సినిమాలు చేస్తే, తెలుగు లో గ్యాప్ వస్తుంది. తెలుగులో రెండు సినిమాలు చేస్తే, హిందీలో గ్యాప్ వస్తుంది. ఇలా చేయడం వల్ల ప్లానింగ్ లేకుండా పోతుంది. ఇకపై తెలుగులో ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను అని ఆదా శర్మ చెబుతోంది. తాజాగా హిందీలో -కమాండో 3, మ్యాన్ టూ మ్యాన్ సినిమాలు కమిట్ అయింది ఈ సుందరాంగి. కమాండో సీరీస్ లో వస్తున్న మూడో చిత్రమిది. మ్యాన్ టూ మ్యాన్ లో అబ్బాయిగా నటిస్తోంది. వీటితో పాటు ఓ వెబ్ సీరిస్, రెండు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదా డ్రీమ్ హీరోయిన్ అవ్వాలన్నది. ఆ డ్రీమ్ నెరవేరింది కదా? మరి ఇప్పుడు ? అని ఆదాని అడిగితే…. ? భవిషత్తు ఎలా చెప్పగలం చూద్దాం.. అంటూ తెలివిగా తప్పించుకుంటోంది. దటీజ్ ఆదా శర్మా!