కోవిడ్ 19 మహమ్మారీ సెలబ్రిటీలకు కంటిపై కునుకు పట్టనివ్వడం లేదు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ఎస్.ఎస్.రాజమౌళి, బండ్ల గణేష్, దర్శకుడు అజయ్ భూపతి, యాంకర్ రవి వంటి వాళ్లకు కోవిడ్ సోకింది. పలువురు టీవీ సీరియళ్ల ఆర్టిస్టులకు కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో కొందరు ఇప్పటికే కోలుకోగా.. కొందరికి చికిత్స ఇంకా కొనసాగుతోంది. పలువురు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.
తాజాగా కోవిడ్ 19 సోకిన పాపులర్ హీరోయిన్ నిక్కీ గల్రానీ .. తనకు కోవిడ్ సోకిందని తెలిసి గజగజ ఒణికిందట. భయానక సన్నివేవమది.. నెమ్మదిగా కోలుకుంటున్నా అంటూ కాస్త ఆవేదనగానే చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. నిక్కీ ఇంతకుముందు ఆది పినిశెట్టి సరసన `మలుపు` చిత్రంలో నటించింది. కోలీవుడ్ లో పాపులర్ హీరోల సరసన నిక్కీ నటించింది. ఇప్పటికీ కెరీర్ పరంగా బిజీ. నిక్కీ సోదరి సంజన టాలీవుడ్ లో పాపులర్ అన్న సంగతి తెలిసిందే.
నిక్కీ తాజా పోస్టులో అసలు ఇలాంటి కష్ట కాలంలో తనవారిని తలుచుకుంటేనే భయంగా ఉందని ఆవేదన చెందడం ఆశ్చర్యకరం. “నేను ఇంటి వద్ద క్వారంటైన్ లో ఉండగలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం ఇది అందరికీ నిజంగా భయానక సమయం అని నాకు తెలుసు. సురక్షితంగా ఉంటూనే ఇతరుల భద్రత గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. నా వయస్సు దృష్ట్యా.. గతంలో ఎలాంటి రుగ్మతలు లేవు కాబట్టి నేను దీని నుంచి బయటపడతానని నాకు తెలుసు. నా తల్లిదండ్రుల గురించి.. ఇంట్లో పెద్దలు, నా స్నేహితులు ఈ వ్యాధితో ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించినప్పుడు ఇది నన్ను భయపెడుతోంది“ అని నిక్కీ తెలిపింది.