’30 ఇయర్స్ ఇండ్రస్ట్రీ ఫృథ్వీ’ గా పేరుపడ్డ సినీ నటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ కు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పదవి వరించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పృథ్వీరాజ్‌ను కీలక పదవిలో నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
కృష్ణాజిల్లాకు చెందిన పృథ్వీ ఈమధ్య కమెడియన్లలో బాగా పాపులర్ అయ్యి… బాగా నవ్విస్తున్నారు. దాదాపు ప్రతీ సినిమాలోనూ ఆయనే ఉంటన్నారు. ఆ మధ్య బాలయ్య డైలాగులను ఇమిటేట్ చేయటం, ఆయన గెటప్ లు వేయటం చేసారు. అయితే ఆ తర్వాత బాలయ్య ఫ్యాన్స్ వార్నింగ్ లతో కాస్త తగ్గారు.
సినిమాల్లో ఫృథ్వీ క్యారెక్టర్ 10 నిమిషాలు వర్కవుట్ అయితే చాలు, ఆ సినిమాలో కామెడీకి ఢోకా లేనట్టే అనే నమ్మకం ఏర్పడుచుకున్నారు. డిమాండ్‌కి తగ్గట్టే.. ఫృథ్వీ రెమ్యునరేషన్ కూడా రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది. గోపీచంద్ లౌక్యం సినిమా ఆయన బ్రేక్ ఇచ్చింది. అంతకి ముందు… ఫృథ్వీ పారితోషికం వేలల్లో ఉండేది. ఆసినిమాతో ఒక్క సారిగా దూసుకొచ్చేశాడు ఫృథ్వీ. ఫృథ్వీ డైరీలో 30 రోజులూ ముందుగానే నిండిపోతున్నాయని, ప్రస్తుతం ఇండ్రస్ట్రీలో ఉన్న కమిడియన్లలో ఇంత బిజీగా ఉన్నది ఫృథ్వీ ఒక్కడే కావటం విశేషం.
అయితే అంత బిజీలోనూ ఆయన గత కొంతకాలంగా వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. పార్టీ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారు.
వైఎస్ జగన్ ఇటీవల నిర్వహించిన ప్రజాసంకల్పయాత్రలో కూడా ఆయన పాల్గొన్నారు. అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఫల్యాలను, ప్రజల సమస్యలను తరచూ ఎత్తిచూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సామాన్యప్రజలకు తెలిసేలా త్వరలో వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను పార్టీ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.