ప్రపంచంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. అన్ని రంగాల్ని చుట్టుముట్టేసి…మృత్యు గడియలు మ్రోగిస్తోంది. ఇప్పటికే హాలీవుడ్ లో నటుడు అలెన్ గార్ఫిల్డ్ , నటి హిల్లరీ హీత్ , మార్క్ బ్లమ్ సహా పలువురు నటులు మహమ్మారి సోకి మృత్యువాత పడ్డారు. తాజాగా మరో హలీవుడ్ నటుడు నిక్ కార్డెర్ (41) కన్నుమూసాడు. 90 రోజుల పాటు వైరస్ తో సుదీర్ఘ పోరాటం చేసిన నిక్ ఆదివారం మృతిచెందినట్లు తెలిసింది. నిక్ ఏప్రిల్ లో కరోనా బారిన పడ్డాడు. దీంతో లాస్ ఏంజిల్స్ లోని సెడార్స్ సినియ్ మెడికల్ సెంటర్ లో చికిత్స తీసుకుంటున్నారు. జూన్ లో కుడి కాలి రక్తం గడ్డకట్టడంతో డాక్టర్లు మరో దారి లేక కాలు తేసేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించడం..కాలు కూడా తొలగించడంతో మానసికంగా నిక్ మరింత క్షోభకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమంగా మారింది. శరీరంలో వైరస్ దాడి అంతకంతకు పెరిగిపోవడంతో ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనతో హాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 41 ఏళ్ల వయసులోనే అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆయన కుటుబం శోక సంద్రంలో మునిగిపోయింది. నిక్ సన్నిహితులు, స్నేహితులు, హాలీవుడ్ ప్రముఖులు దిగ్ర్బాంతికి గురయ్యారు. ఇటు కరోనా భారత్ లోనూ విలయ తాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే.
నానాటికి కేసులు సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. టాలీవుడ్ లోనూ ఇటీవల కరోనా కలకలం మొదలైంది. పలువురు బుల్లి తెర నటులు వైరస్ బారిన పడటం బుల్లి తెర నటుల్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో మొదలైన సీరియల్ షూటింగ్ లు సైతం నిలిపి వేసారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కేసుల పెరగడంతో మళ్లీ లాక్ డౌన్ దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే సీనియర్ నిర్మాత పోకూరి రామారావు వైరస్ బారిన పడి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి టాలీవుడ్ ని పెద్ద షాక్ కి గురి చేసింది.