కొద్దిరోజుల వరకూ నందమూరి బాలకృష్ణను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించిన నటుడు నాగబాబు.. ఈ సారి ఆయన అల్లుడు, మంత్రి నారా లోకేష్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ రెండు కుటంబాలపై తనదైన శైలిలో, సెటైరికల్‌గా విమర్శలు చేయడానికి ఆయన సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. దీని పేరు మై ఛానల్: నా ఇష్టం`.
వర్తమాన రాజకీయాలు, కొందరు రాజకీయ నాయకులపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పడానికే దీన్ని ఆరంభించినట్లు చెప్పారు. తాను చేయబోతున్న విమర్శలు తన వ్యక్తిగతం అని వెల్లడించారు. తనకున్న ఆసక్తితో యూట్యూబ్‌లో ఈ ఛానల్ ను ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఈ పేరు పెట్టినంత మాత్రాన తానేమీ నోటికి వచ్చినట్లుగా, వ్యక్తిగతంగా ఇతరులను దూషించబోనని చెప్పారు.
అలాగని ఎవరిపై పడితే వారిపై విమర్శలు చేయనంటూ క్లారిటీ కూడా ఇచ్చాడు. రాజకీయ పరమైన విమర్శలు చేస్తాను తప్ప వ్యక్తిగతంగా మాత్రం ఎవరిని విమర్శించనంటూ చెప్పుకొచ్చారు. ఒక్కో వీడియోలో ఒక్కో వ్యక్తిని ఎంపిక చేసుకుంటానంటూ చెప్పుకొచ్చిన నాగబాబు తన మొదటి వీడియోలో ఏపీ మంత్రి నారా లోకేష్ ను ఎంపిక చేసుకున్నాడు.
పిల్లలు, దేవుడు చల్లని వారే అంటూ పాట వినేవాడిని, పిల్లలు అబద్దాలు ఆడరని, ఈ పిల్లాడు ఏం మాట్లాడాడో ఒక సారి చూడండి అంటూ గతంలో నారా లోకేష్ చేసిన ఓ కామెంట్ క్లిప్‌ను ప్రదర్శించారు. `అవినీతి, బంధుప్రీతి, మత పిచ్చి, కుల పిచ్చి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది తెలుగు దేశం పార్టీయే..` అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలను చూపించారు. ఆ పిల్లాడు ఎంత బాగా మాట్లాడాడో, నిజాన్ని నిర్బయంగా ఒప్పుకునే దమ్ము ఎవ్వరికీ లేదని, లోకేష్ బాబు గారు మీరు గ్రేట్ అంటూ నాగబాబు ఫన్నీ కామెంట్స్ చేశాడు.
https://youtu.be/1KHrN6Y0juc