సీనియర్ నటుడు.. మాజీ `మా` అధ్యక్షుడు శివాజీ రాజాకు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని .. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ లో చేర్చారని తెలుస్తోంది. శివాజీరాజా వయసు 58 సంవత్సరాలు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు.. వైద్యులు తెలిపారు. శివాజీ రాజాకు గుండె ఆపరేషన్ చేయనున్నారని సమాచారం.
ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలు దర్శకులకు ఎంతో సన్నిహితంగా మెలిగే ఆయన రెండున్నర దశాబ్ధాల కెరీర్ ని సాగించారు. దాదాపు 400 పైగా చిత్రాల్లో నటించిన రాజా బ్లాక్ బస్టర్ టీవీ సీరియల్స్ అమృతం.. అలస్యం అమృతం విషం.. మిస్టర్ రోమియో.. పాండు మిరపకాయ్ .. పాపమ్ పద్మనాభం.. మొగుడ్స్ పెళ్లామ్స్ తదితర టీవీ కార్యక్రమాలతో అలరించారు. సినీకెరీర్ లో నాలుగు నంది అవార్డులను గెలుచుకున్నాడు.
2017-19 సీజన్ రెండేళ్లపాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఎంఐఏ) అధ్యక్షుడిగా శివాజీ రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడిగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేయడం పెద్ద ప్లస్ అయ్యింది. మా భవంతి నిర్మాణం కోసం నిధి సేకరణ కార్యక్రమాల్ని చేశారు. అయితే మా కమిటీ కీలక వ్యక్తి అయిన నరేష్ తో ఘర్షణ వాతావరణం మా సంఘాన్ని వివాదాల్లోకి నెట్టింది. ఇటీవలే కుమారుడు విజయ్ రాజాను `ఏదైనా జరగొచ్చు` అనే సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం చేసి సంగతి విధితమే.
