వరుణ్‌ తేజ్‌ కారుకు యాక్సిడెంట్, కారు నుజ్జు నుజ్జు

సినీనటుడు వరుణ్‌ తేజ్‌ కారు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై వరుణ్‌ తేజ్‌ కారును మరో కారు ఢీకొట్టడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన క్షేమంగా బయటపడ్డారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు షూటింగ్‌ నిమిత్తం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం.

ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ నుజ్జునుజ్జయ్యాయి. వాహనం దెబ్బతినడంతో వరుణ్‌ తేజ్‌, ఇంకొందరు నటులు మరో వాహనంలో బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ వాల్మీకి చిత్రంలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఏడాది వరుణ్ తేజ్ ఎఫ్2 చిత్రంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు.