బాక్స్ ఆఫీస్ ఘజినికి ఈసారన్నా విజయం వరిస్తుందా?

వరుసపెట్టి సినిమాలతో బాక్సాఫీస్ మీద దాడి చేస్తున్న ఆదికి ఈసారన్నా విజయం వరుస్తుందా? ఇటీవల ‘బుర్రకథ’ అనే సైంటిఫిక్ ఫిక్షన్‌తో వచ్చిన ఆది.. ఇప్పుడు ఒక మంచి ప్రేమకథా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అదే ‘జోడి’ చిత్రం. ఈ చిత్రానికి విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించారు. యూత్‌ఫుల్ స్టార్ ఆది సాయికుమార్ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆది నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా సోలో హీరోగా ఇంకా సరైన సక్సెస్‌ను అందుకోలేదు.

ఇటీవల వచ్చిన ‘బుర్రకథ’ సినిమా కాన్సెప్ట్ బాగున్నా దర్శకుడు రత్నబాబు తడబాటుతో సినిమాను సరిగా తెరకెక్కించలేకపోయారు. అయితే, ఇప్పుడు ఆది ఒక మంచి ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం పేరు ‘జోడి’. కన్నడ బ్యూటీ, ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ ఈ చిత్రంలో ఆదికి జోడీగా నటించారు. ఈ చిత్ర షూటింగ్ తాజాగా పూర్తయింది. సెప్టెంబర్ 6న సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఇటీవల విడుదలైన ‘జోడి’ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించారు. గతంలో ‘‘వాన, మస్కా, సినిమా చూపిస్త మామ’’ చిత్రాలకు విశ్వనాథ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు ‘జోడి’ ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దర్శకుడు విశ్వనాథ్ అద్భుతమైన ప్లానింగ్ వల్ల ‘జోడి’ చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ చెబుతోంది. క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారట. చిత్రం అనుకున్న దానికంటే బాగా వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ‘జోడి’ చిత్ర ప్రమోషన్స్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

ఈ చిత్రమైనా ఆదికి సోలో హీరోగా సరైన సక్సెస్‌ను అందిస్తుందో లేదో చూడాల్సిందే!