దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.రాశశేఖరరెడ్డి రాజకీయ ప్రత్యర్థులు అన్న సంగతి అందరికీ తెలిసినదే. వారి రాజకీయ శత్రుత్వం ఒక కోణం అనుకుంటే చంద్రబాబు- వైయస్ఆర్ మధ్య పొలిటికల్ కెరీర్ ఆరంభంలో ఎలా ఉండేది? అన్నది బయటి ప్రపంచానికి తెలిసినది తక్కువే.
నిజానికి ఆ ఇద్దరూ కూడా సన్నిహితులే. కానీ రాజకీయ వైరం పెరిగి పెద్దదైంది. అయితే బయటి ప్రపంచానికి తెలియని ఆ ఇద్దరి మధ్యా లోతైన స్నేహంపై ఓ చిత్రం తెరకెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందన్నది బిగ్ ట్విస్ట్.
మొదటి భాగంలో ఇద్దరు దిగ్గజ నాయకుల మధ్య స్నేహానికి నాంది ఏమిటి? అన్నది చూపిస్తారు. ఇది ప్రధానంగా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎదుగుదల ఆపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన మైలురాయి పదవీకాలానికి సంబంధించిన కథతో తెరకెక్కుతుంది. మరోవైపు, రెండవ భాగం వైయస్ఆర్ రాజకీయాలలో ఎదిగే క్రమం.. చంద్రబాబు నుండి పాలనా పగ్గాలు లాక్కొనే విధానంపై సీఎంగా రాజశేఖర్ రెడ్డి లైఫ్ పైనా ఉంటుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాజ్ దర్శకత్వం వహించనున్నారు. తిరుమల్ రెడ్డి సహకారంతో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాత విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.