చెత్త యాడ్స్‌లో నటిస్తే ఐదేళ్లు జైలు, 50లక్షలు ఫైన్
మా కంపెనీ కోలా తాగితే ఎనర్జీ బూస్ట్ లభించును. మేం మార్కెట్లో ప్రవేశ పెట్టిన ఫలానా మామిడి పండు రసం తాగితే కడుపు ఫుల్లుగా నిండును! ఈ తరహా ప్రచారంతో ప్రజా జీవితాలతో ఆడుకుంటున్నాయి కోలా కంపెనీలు. పరిమితులకు మించి పెస్టిసైడ్స్ (విష రసాయనాలు) కోలాల్లో కలిపి విక్రయిస్తున్నా.. అడిగే నాధుడే లేడు. వందల వేల కోట్ల బిజినెస్ కేవలం ఒక్క కోలా బ్రాండ్లతోనే జరుగుతోంది. ఇక ప్రజల బలహీనతల్ని క్యాష్ చేసుకునేందుకు రకరకాల మోసాలకు పాల్పడుతున్న కంపెనీల భోగోతాలు చాలా సందర్భాల్లో బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి చెత్త ప్రకటనల కోసం క్రేజు ఉన్నస్టార్లను కోలా కంపెనీలు బ్రాండింగ్ కోసం ఉపయోగిస్తున్నాయి. పలువురు కథానాయికలు రకరకాల బ్రాండ్లకు పబ్లిసిటీ చేస్తున్నారు. వీటిలో నాణ్యతా ప్రమాణాలు పాటించని నాశిరకం చెత్త కంపెనీలు ఎన్నో ఉంటున్నాయి. మనిషి జీవితంతో కార్పొరెట్ ఆడుతున్న ఆట మామూలుగా లేదన్న విమర్శలు ఉన్నాయి.
అందుకే ఈ కార్పొరెట్ కంపెనీల అడ్డగోలు బిజినెస్ లకు చెక్ పెట్టేందుకు తాజాగా రాజ్యసభలో ఓ కొత్త బిల్లు పాస్ అయ్యింది. `వినియోగదారుల రక్షణ బిల్లు -2019`కి ఇదివరకూ లోక్ సభలో క్లియరెన్స్ వచ్చింది. తాజాగా రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఫైనల్ గా రాష్ట్రపతి సంతకం పెడితే అమల్లోకి వచ్చేసినట్టే. ఈ బిల్లులో ఉన్న ఒక క్లాజ్ మన స్టార్ హీరోలకు ముకుతాడు వేసేదిగా ఉండడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇకపై ఎవరైనా హీరో లేదా హీరోయిన్ చెత్త యాడ్స్‌లో నటిస్తే ఐదేళ్లు జైలు, 50లక్షలు ఫైన్ తప్పదు. పనికిమాలిన ప్రకటనల్లో నటించి అభిమానుల్ని లేదా అమాయక జనాల్ని తప్పుదారి పట్టిస్తే వెంటనే 10లక్షల ఫైన్ వేస్తారు. అదే తప్పు పదే పదే రిపీట్ చేస్తే సదరు స్టార్లకు 50లక్షల వరకూ ఫైన్ తో పాటు జైలు శిక్ష పడుతుంది.
వింటున్నారా? ఇది తప్పు చేస్తే తోలు ఒలిచే చట్టమే. ధనార్జనే ధ్యేయంగా సంపాదన కోసం కక్కుర్తి పడి ప్రమాణాలు పాటించని కోలా కంపెనీలతో, లేదా కల్తీ కంపెనీలతో బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకుంటే వెంటనే శంకర మాన్యాలు పట్టాల్సిందే. ముఖ్యంగా ఈ విషయాన్ని టాలీవుడ్ అగ్ర హీరోల్లో కొందరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హీరోలూ తస్మాత్ జాగ్రత్త!!