ఆ 50 కోట్లు దెయ్యం ఎత్తుకెళ్లిందా?
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయమై బిహారీ పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో ముంబై పోలీసులు, బీఎంసీ- మున్సిపల్ అధికారులు సహకారానికి నిరాకరిస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ముంబై పోలీసులపై బిహారీ పోలీసులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
సుశాంత్ ది హత్యనా? ఆత్మహత్యనా? అన్న దర్యాప్తు సాగిస్తున్న ముంబై పోలీసులు నిజాల్ని దాస్తున్నారన్న సందేహాల్ని బిహారీ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ సింగ్ బ్యాంక్ ఖాతాలో గత నాలుగేళ్లలో రూ.50 కోట్లు జమ అయ్యింది. అదంతా మటు మాయమైంది. ఒకసారి రూ.17కోట్లు జమ అయితే వెంటనే రూ.16 కోట్లు విత్ డ్రా చేసేశారు. ఇలా పెద్ద ట్రాన్జాక్షన్స్ జరిగినా పోలీసులు దీనిపై బయటికి ఏదీ చెప్పడం లేదు. ఆ డబ్బంతా ఎటు పోయింది? అన్నది బిహారీ డీజీపీ ప్రశ్నిస్తున్నారు. కానీ అట్నుంచి సరైన ఆన్సర్ రావడం లేదు.
సుశాంత్ పై ముంబై మాఫియా దాడికి పాల్పడి హత్య చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్రియురాలు సుశాంత్ నుంచి డబ్బు తీసుకోవడంపై అనుమానాలున్నాయి. అలాగే ప్రియురాలు రియా చక్రవర్తి సోదరుడితో సుశాంత్ బిజినెస్ లావాదేవీలపైనా రకరకాల సందేహాలున్నాయి. రియా చక్రవర్తి వెనక ఉండి కథ నడిపిస్తున్న ప్రియుడు మహేష్ భట్ పైనా నెటిజనులు.. కంగన వంటి నటి రకరకాల సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మనీ ట్రయల్ అనేది కీలకంగా మారిందిపుడు. దీని వెనక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా? అన్నది పోలీసులే తేల్చాల్సి ఉంటుంది.