యాదగిరి గుట్టలో “దేవుడున్నాడు”

38 సంవత్సరాల నాటి సంగతి
38 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు అచ్చి వేణుగోపాలాచార్యులు దర్శకత్వం వహించిన “దేవుడున్నాడు ” అనే చిత్రం షూటింగ్ యాదగిరిగుట్టలో జరుగుతుంది ఆ చిత్రం కవరేజ్ కోసం వేణుగోపాలాచార్యులుఆహ్వానిస్తే యాదగిరి గుట్ట (ఇప్పుడు యాదాద్రి ) వెళ్ళాను . అప్పుడు నేను ఆంధ్ర జ్యోతి నుంచి ప్రచురితమయ్యే “జ్యోతి చిత్ర ” సినిమా వార పత్రికలో రిపోర్టర్ గా ఉండేవాడిని . ఆరోజుల్లా సితార , జ్యోతి చిత్ర , సినీ హెరాల్డ్ , వెండితెర నాలుగు సినిమా వార పత్రికలు. అయితే సితార (ఈనాడు ) జ్యోతి చిత్ర (ఆంధ్ర జ్యోతి ) పత్రికలు కలర్ లో వచ్చేవి .. జ్యోతి చిత్ర ప్రతి మంగళవారం మార్కెట్లోకి వచ్చేది . సితార ప్రతి గురువారం వెలువడేది . ఈ రెండు పత్రికల్లో జ్యోతి చిత్ర లార్జెస్ట్ సర్క్యూలేటెడ్ ఫిలిం వీక్లీ . నేను హైదరాబాద్ లో జ్యోతి చిత్ర పత్రిక ఇంచార్జి గా ఉండేవాడిని .

ప్రతి నిర్మాత, దర్శకుడు , నటీనటులు తమ వార్తలు జ్యోతి చిత్రాల్లో రావాలని కోరుకునేవారు . అందుకే నన్ను తప్పకుండా ఆహ్వానించేవారు . ఆ సినిమాలో నరసింహరాజు , ప్రభ హీరో హీరోయిన్లు . జనవరి 7, 8 రెండు రోజుల పాటు కొండమీదే యూనిట్ తో పాటు ఉన్నాము . తెలంగాణాలో యాదగిరి నరసింహ స్వామి ప్రఖ్యాతి చెందిన దేవుడు . ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు స్వామిని సందర్శిస్తుంటారు .

ఆ సినిమా కథ దేవుడికి సంబంధించింది కాబట్టి వేణుగోపాచార్యలు ఎక్కువ భాగం యాదగిరి గుట్టలోనే ప్లాన్ చేశారు .
సినిమా షూటింగ్ అనగానే వేలాది మంది భక్తులు కొండమీదకు వచ్చేశారు . వారిని అదుపు చెయ్యడాని పోలీసులు వున్నారు . అయితే అప్పటి భక్తులు, సినిమా అభిమానులు సహకరించారు తప్ప ఇబ్బందులు పెట్టలేదు . ఆ దేవాలయం మధ్యలో రాతి స్తంభాల మండపం ఉంది . దర్శకుడు వేణుగోపాచార్యులతో ఆ రెండు రోజులు సినిమా తో పాటు సాహిత్య విషయాలను చర్చించడం మర్చిపోలేని అనుభవం . అప్పుడు నటీనటులు జర్నలిస్టులతో చాలా స్నేహ భావంతో ఉండేవారు అని చెప్పడానికి ఈ ఫొటోలే నిదర్శనం .

ప్రభ , నరసింహరాజు షూటింగ్ గ్యాప్ లో మేమున్న మండపంలో కూర్చునేవారు . ఏ మాత్రం గ్లామర్ దరి చేరకుండా అతి సామాన్యుల్లా ఉండేవారు జర్నలిస్టులంటే ఎంతో అభిమానంగా ఉండేవారు . షూటింగ్ లో ఏమాత్రం అవకాశం దొరికినా అభిమానులతో మాట్లాడి జర్నలిస్టుల దగ్గరకు వచ్చేవారు . రచయిత, కవి , దర్శకుడు, అచ్చి వేణుగోపాలాచార్యులు తెలుగు, ఉర్దు , సంస్కృతంలోప్రజ్ఞావంతుడు . వైష్ణవ మతాభిమాని . తెలుగులో అనేక గ్రంధాలను రచించారు . నిరాడంబరుడు , నిగర్వి , స్నేహశీలి .

అయన రాసిన పాటలు తక్కువే. కానీ ఇప్పటికీ ఆ పాటలు ప్రజల హృదయాలపై చెరగని ముద్ర వేశాయి . పట్నంలో శాలిబండ .. పేరైన గోలుకొండ (అమాయకుడు ) నమో వెంకటేశా .. నమో తిరుమలేశా ( శ్రీవెంకటేశ్వర వైభవం ) చుక్కల చీర కట్టి ( ముద్దు బిడ్డ ) అచ్చి వేణుగోపాలాచార్యుల వారికి యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి వారి తో ఎంతో అనుబంధం వుంది . నరసింహ స్వామి వీరి కుటుంబ దైవం .  అక్కడ బ్రహ్మ్మోత్సవాలు వీరి కుటుంబ ఆధ్వర్యంలోనే జరుగుతాయి . పండితుడు , సినిమా అంటే అమితమైన అభిమానం వున్న వేణుగోపాచార్యులు 2016లో తన 91వ ఏట చనిపోయారు .
-భగీరథ