టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా జయాపజయాలు అనేవి కామన్. అయితే వాటిలో కొన్ని ఫ్లాపులు వచ్చినప్పుడు మాత్రం హీరోలు మళ్ళీ దాని నుంచి బయటపడడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఇక కొందరు హీరోలకు 2019 బాగా కలిసొచ్చింది. ఎప్పట్నుంచో వేధిస్తున్న ఫ్లాపుల నుంచి వాళ్లు బయటపడ్డ హీరోలు ఈ సంవత్సరంలో ఎక్కువే ఉన్నారని చెప్పవచ్చు. ఈ ఏడాది వాళ్లు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించాయి. ఇందులో అందరికంటే ముందున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈయన ఐదేళ్ల నిరీక్షణ తర్వాత `రాక్షసుడు` సినిమాతో విజయం సాధించాడు. ఈ చిత్రానికి తొలిరోజే టాక్ అద్భుతంగా రావడంతో మంచి వసూళ్లే రాబట్టింది. చివరికి అమ్మిన దానికంటే రెండు కోట్లు ఎక్కువే తీసుకొచ్చి లాభాలు రాబట్టింది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్.
ఇక నేను శైలజ తర్వాత రామ్ ఎన్నో చిత్రాల్లో నటించారు కానీ సరైన హిట్ మాత్రం రాలేదు. రామ్.. 2019లో `ఇస్మార్ట్ శంకర్`తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పూరీ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇప్పటికే 75 కోట్ల గ్రాస్.. 38 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. సాయి ధరమ్ తేజ్ తన పేరు మార్చుకుని హిట్ కొట్టాడు. `సుప్రీమ్` తర్వాత అరడజన్ ఫ్లాపులు ఇచ్చిన ఈ హీరో.. ధరమ్ పీకేసి సాయి తేజ్ అంటూ వచ్చిన `చిత్రలహరి` సినిమాతో విజయం అందుకున్నాడు. ఈ సినిమాతో పాటు ఇప్పుడు వచ్చిన `ప్రతిరోజూ పండగే` సినిమా కూడా మంచి విజయమే సాధించింది. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే ఏకంగా 14 కోట్ల షేర్ వసూలు చేసింది.
నాగచైతన్య కూడా చాలా ఏళ్ళ తర్వాత బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. `రారండోయ్ వేడుక చూద్దాం` తర్వాత చేసిన `యుద్ధం శరణం`, `సవ్యసాచి` సినిమాలు ఫ్లాప్ అవ్వగా… `శైలజా రెడ్డి అల్లుడు`, పర్వాలేదనిపించుకుంది. ఈ ఏడాది మజిలీ సినిమాతో హిట్ కొట్టాడు చైతూ. ఈ సినిమా దాదాపు 35 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఈ సినిమాతో పాటు వెంకీ మామ కూడా మంచి విజయమే సాధించింది. ఈ చిత్రం కూడా 32 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. కళ్యాణ్ రామ్ కూడా ఈ ఏడాది హిట్ కొట్టాడు. ఈయన నటించిన `118` సినిమా మంచి విజయం అందుకుంది. 10 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం 11 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
ఇక వెంకటేష్ కూడా 2019లో రెండు విజయాలు అందుకున్నాడు. ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన `ఎఫ్2` చిత్రమయితే మరొకటి ఇటీవలె విడుదలైన బాబి దర్శకత్వంలో రూపొందిన చిత్రం `వెంకీ మామా`తో విజయాలు అందుకున్నాడు. ఈ రెండు చిత్రాలూ నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చాయి. నాని కూడా రెండు ఫ్లాపుల తర్వాత 2019లో విజయం అందుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ తర్వాత ఈ ఏడాది నటించిన `జెర్సీ` సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు విజయం కూడా అందుకున్నాడు. కానీ `గ్యాంగ్ లీడర్` సినిమాతో దారుణంగా నిరాశ పరిచాడు న్యాచురల్ స్టార్. మొత్తానికి ఈ ఏడాది కుర్ర హీరోలతో పాటు సీనియర్లు కూడా పోటీపడి ఫ్లాప్‌ల నుంచి బయటపడి హిట్లు కొట్టారు. మొత్తానికి ఈ 2019 సినిమావాళ్ళకు బాగానే కలిసొచ్చిందని చెప్పవచ్చు.