40,000 ఐమ్యాక్స్ స్క్రీన్ల‌లో 2.0 రిలీజ్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, ఎమీజాక్స‌న్, అక్ష‌య్ కుమార్ కాంబినేష‌న్ లో శంక‌ర్ తెర‌కెక్కించిన 3డి చిత్రం 2.0 సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. 2018 న‌వంబ‌ర్ లో 2.0 దాదాపు 10,500 స్క్రీన్ల‌లో రిలీజైంది. ఈ సినిమా దాదాపు 550కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 850కోట్లు వ‌సూలు చేసింద‌ని అప్ప‌ట్లో ట్రేడ్ వెల్ల‌డించింది. తెలుగు రాష్ట్రాల్లో సేఫ్ క‌లెక్ష‌న్స్ తో బ‌య‌ట‌ప‌డినా త‌మిళ‌నాడు స‌హా కొన్నిచోట్ల భారీ ధ‌ర‌ల‌కు కొన‌డం వ‌ల్ల‌ అక్క‌డ‌క్క‌డా పంపిణీదారుల‌కు న‌ష్టాలొచ్చాయ‌ని ట్రేడ్ పేర్కొంది.

చైనాలో దంగ‌ల్ రికార్డులు తిర‌గ‌రాస్తుందా?

అయితే 2.0 చిత్రాన్ని చైనాలోనూ అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు లైకా సంస్థ స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జూలై 12న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 6 కి వాయిదా వేస్తూ అప్ప‌ట్లో ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. రిలీజ్ కి ఇంకెంతో స‌మ‌యం లేనేలేదు. దాదాపు 40,000 ఐమ్యాక్స్ స్క్రీన్ల‌లో రిలీజ్ చేస్తున్నామ‌ని తాజాగా పోస్ట‌ర్ ని రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. ఇండియా స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2.0 తొలి రిలీజ్ కేవ‌లం 10,500 స్క్రీన్లు మాత్ర‌మే కాగా.. ఇప్పుడు ఇన్ని థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతోంది అంటే అందుకు త‌గ్గ‌ట్టే చైనాలో ఈ సినిమా ఎలాంటి రికార్డులు బ్రేక్ చేయ‌నుందోన‌న్న ఉత్కంఠ క‌లుగుతోంది. ముఖ్యంగా ర‌జ‌నీకాంత్, శంక‌ర్, అక్ష‌య్ కుమార్ ఫ్యాన్స్ లో ఎగ్జ‌యిట్ మెంట్ పెంచుతున్న వార్త ఇది. అలాగే అమీర్ ఖాన్ దంగ‌ల్ అంతే భారీగా రిలీజై అప్ప‌ట్లో చైనా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 1200 కోట్ల గ్రాస్ 525కోట్ల డిస్ట్రిబ్యూట‌ర్ షేర్ సాధించి సంచ‌ల‌నాలు సృష్టించింది. ఆ రికార్డును 2.0 చైనా రిలీజ్ బ్రేక్ చేస్తుందా అన్న‌ది వేచి చూడాలి.