100 మంది ఫైటర్లతో `సాహో` క్లైమాక్స్ ట్రీట్!
ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న `సాహో` రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సాంకేతిక కారణాల వల్ల ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30 కి వాయిదా అంటూ ప్రచారం సాగుతోంది. అయితే దీనిని యువి క్రియేషన్స్ సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ అండ్ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ సహా రీరికార్డింగ్ లో ఇంటర్నేషనల్ స్టాండార్డ్స్ కోసం ప్రభాస్ పూర్తిగా టెక్నికల్ టీమ్ తో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నారట.
తాజాగా సాహో గురించి మరో ఆసక్తికర అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా క్లైమాక్స్ ఇండియన్ సినిమా స్క్రీన్ పై నెవ్వర్ బిఫోర్ అన్నంతగా ఎంటర్ టైన్ చేస్తుందట. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో డార్లింగ్ అదరగొట్టేస్తాడట. ఈ ఒక్క ఫైట్ సీన్ కోసం ప్రపంచ దేశాల నుంచి 100 మంది ఫైటర్లను బరిలో దించి దాదాపు 100 కోట్లు ఖర్చు చేసి ఈ సీన్ ని తెరకెక్కించారట. కేవలం సెట్ నిర్మాణం కోసమే 70 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లు కెన్నీ బేట్స్ – పెంగ్ జాంగ్ (రష్ హవర్ 3 ఫేం) సాహో క్లైమాక్స్ ఫైట్ ని ఛాలెంజింగ్ గా తెరకెక్కించారట. ఈ ఫైట్ కోసం అబూ దబీలో ఏకంగా 10 ఎకరాల్లో ఓ ఎడారి సెట్ ని నిర్మించారు. అలాగే క్లైమాక్స్ లో ఎనిమిది నిమిషాల పాటు గ్యాప్ అన్నదే లేకుండా సాగే యాక్షన్ సీక్వెన్స్ కళ్లు తిప్పుకోనివ్వదని తెలుస్తోంది. కేవలం ఈ సీన్ కోసమే రెండేళ్ల ప్రిపరేషన్ సాగించారట సుజీత్ టీమ్. అలాగే సన్నివేశంలో సహజత్వం కోసం నిజమైన ఎడారిని తలపించేలా సెట్ వేశారు. దీనికోసం డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేశారట.
ఇక క్లైమాక్స్ ఫైట్ ఎంతో ప్రాణాంతకమైనది. ఎంతో రిస్క్ తో కూడుకున్నది కావడంతో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ విద్యల్లో ఎంతో నిష్ణాతులైన వంద మందిని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొచ్చారట. ప్రభాస్ తో పాటు ఈ వంద మంది గ్యాంగ్ పై భీకరమైన పోరాట దృశ్యాన్ని తెరకెక్కించారు. అలాగే కెన్నీ బేట్స్ తో పాటు పని చేసిన పెంగ్ జాంగ్ ఇప్పటికే ఫేమస్ హాలీవుడ్ సినిమాలకు పని చేశారు. ది లాస్ట్ సమురై – హెల్ బోయ్ 2 చిత్రాలకు పని చేశారు. అలాగే ఈ చిత్రంలో ప్రభాస్- శ్రద్ధా కపూర్ లపై ఆస్ట్రియాలోని ఎత్తైన కొండలపై తెరకెక్కించిన రొమాంటిక్ సాంగ్ హైలైట్ గా ఉంటుందట. దీంతో పాటు జాక్విలిన్ ఫెర్నాండెజ్ పై స్పెషల్ నంబర్ వేడెక్కించనుంది. జూలై 15తో సాహో మొత్తం చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రాన్ని తెలుగు-తమిళం-హిందీలో ఒకేసారి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి స్టార్ గా ప్రభాస్ కి ఉన్న క్రేజు దృష్ట్యా ఈ చిత్రాన్ని అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్, మలేషియా, చైనా వంటి చోట్ల భారీగానే రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా భేఢీ, చుంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, అరుణ్ విజయ్, మురళి శర్మ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.