హీరోలంతా నిర్మాత‌ల కోర్టులోనేనా?

tollywood

లాక్ డౌన్ తో ఒక్క‌సారిగా దేశం ఆర్ధిక సంక్షోభంలో ప‌డింది. అన్ని రంగాల‌పై లాక్ డౌన్ తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతోంది. వాట‌న్నింటిని ప‌క్క‌న‌బెడితే! టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌కు మాత్రం లాక్ డౌన్ కోలుకోలేని దెబ్బ‌నే కొడుతుంద‌ని విశ్లేష‌కుల మాట‌. మే 3 తో లాక్ డౌన్ ఎత్తే వేసినా..థియేట‌ర్లు ఇప్పట్లో తెర‌వ‌డం కుదిరే ప‌ని కాద‌ని..క‌నీసం ఆరు నుంచి సంవ‌త్సర‌మైనా స‌మ‌యం ప‌డుతుంద‌ని ప‌రిశ్ర‌మ దిగ్గ‌జాలే విశ్లేషిస్తున్నాయి. అదే జ‌రిగితే సినిమా ఇండ‌స్ర్టీ కోలుకోవ‌డం ఇప్ప‌ట్లో జ‌రిగే ప‌నికాదు. 24 శాఖ‌లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిందే. ఇప్ప‌టికే నిర్మాత‌లు ప్ర‌త్య‌క్షంగా న‌ష్టాలు భ‌రించాల్సిన స‌న్నివేశం ఎదురైంది.

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌కు మూడు నెల‌ల మాడ‌టోరియం ఫెసిలిటీ క‌ల్పించినా…ఆ త‌ర్వాతైనా వ‌డ్డీలు క‌ట్ట‌క త‌ప్ప‌దు. రుణాల మీద వ‌డ్డీ..దాని మీద వ‌డ్డీ బ్యాంకులు ముక్కు పిండీ మ‌రీ వ‌సూల్ చేస్తాయి. అదీ సినిమా ఫైనాన్స్ అంటే కోట్ల‌లో ఉంటుంది కాబ‌ట్టి బ్యాంకుల బాడుడు కూడా గ‌ట్టిగానే ఉంటుంది. మ‌రి ఈప‌రిస్థితిని ఎదుర్కోవ‌డం ఎలా? దిక్కు తోచ‌ని స్థితిలో ప‌రిశ్ర‌మ ప‌డ‌బోతుంద‌న్న సంకేతాలు అందుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితిలో సినిమా నిర్మాణం క‌న్నా..హీరోకి చెల్లించే పారితోషికమే నిర్మాత‌కు త‌డిపి మోపుడ‌వుతుంది. అగ్ర హీరోలంతా ఇప్పుడు రాబ‌డిలో వాటాలు తీసుకుంటున్నారు.

కోట్లాది రూపాయాలు పారితోషికం తీసుకుంటూనే అద‌నంగా లాభాలు ఆర్జిస్తున్న స‌న్నివేశ‌మైతే ఉంది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో నిర్మాత కుదుటుకోవాలంటే! హీరో ఇప్పుడు రెండు మెట్లు కింద‌కు దిగ‌క త‌ప్ప‌ద‌ని అంటున్నారు. పారితోషికంలో మినహాయింపుతో పాటు, లాభాల్లో వాటా కూడ‌కూడ‌ద‌ని.. ఈవిధానం కొన్ని సంవ‌త్స‌రాల పాటు కొన‌సాగితే త‌ప్ప టాలీవుడ్ గ‌త వైభ‌వం రావ‌డం క‌ష్ట‌మ‌వుతుందంటున్నారు. స్టార్ హీరోల పారితోషికం త‌గ్గిందంటే మిగ‌తా వాళ్లంతా లైన్ లోకి వ‌చ్చేస్తారు. అధికంగా పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లు,ఫస్ట్ క్లాస్ టెక్నీషియ‌న్స్ అంతా ఎవ‌రికి వారు విధిగా ముందుకు రాక త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం ఉన్న క్రైస‌స్ ని ఎదుర్కునేందుకు నిర్మాత‌ల మండ‌లి ఆ విధంగానే రంఘం సిద్దం చేస్తోంది. ఇప్ప‌టికే హీరోల‌తో స‌మావేశ‌మై ప‌రిస్థితుల‌పై చర్చించాల‌ని ఆలోచ‌న చేస్తుంది. అయితే ఇక్క‌డ నిర్మాత‌లంతా ఒకే మాట‌పై ఉండాలి. అప్పుడే నిర్మాత‌ల కోర్టులో హీరోలుంటారు. అందులో ఎక్క‌డా తేడా జ‌రిగినా సీన్ మొత్తం రివ‌ర్స్ అవుతుంది.