సెల్ఫ్ క్వారంటైన్ ఇంకెన్ని రోజులు పవన్ ?  

 

సెల్ఫ్ క్వారంటైన్ ఇంకెన్ని రోజులు పవన్ ?  

 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్లో ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే.  సినిమాల చిత్రీకరణ కోసం హైదరాబాద్లోనే ఉన్న ఆయన సడన్ లాక్ డౌన్ విధించడం, వాటి పొడిగింపుతో అక్కడే ఉండిపోయారు.  ఆయన ఏపీకి వచ్చి దాదాపు రెండు నెలల పైనే అవుతోంది.  పార్టీ కార్యకలాపాలన్నింటినీ ఇన్ని రోజులు అక్కడి నుండే పర్యవేక్షించారు.  కరోనా సమయంలో నిర్వర్తించాల్సిన కర్తవ్యాలన్నింటినీ వీడియో కాన్ఫరెన్సులు, ఫోన్లు, ట్విట్టర్ లాంటి మాధ్యమాల ద్వారానే నాయకులకు, శ్రేణులకు చెబుతూ వచ్చారు.  
 
అంతేకాదు రాష్ట్రంలోని పలు రాజకీయ అంశాలు, సమస్యలను కూడా ట్విట్టర్ ద్వారానే విశ్లేషిస్తూ వచ్చారు.  పవన్ అందుబాటు వ్యవహారం బాగా తెలిసిన శ్రేణులు ఆయన రాష్ట్రంలో లేకపోయినా పెద్దగా ఇబ్బందిపడకుండానే ముందుకు సాగారు.  కానీ ఎల్జీ పాలిమర్స్, శ్రీవారి ఆస్తుల వేలం లాంటి పెద్ద ఇష్యూలు వచ్చినప్పుడు మాత్రం ఆయన ఏపీ ప్రజలకు దగ్గర్లో లేకపోవడం పార్టీకి కొంత నష్టాన్ని కలిగించిందనే చెప్పాలి.  రాజకీయంగా కూడా ఆయనపై విమర్శలు లేచాయి.  పవ‌న్‌కు సెల్ఫ్ క్వారంటైన్ అలవాటే కాబట్టి ఈ లాక్ డౌన్ ఆయనకు నిర్భంధం కాదని కొందరు వ్యంగ్యాస్త్రాలు వేస్తే రాష్ట్రానికి దూరంగా హైదరాబాద్లో ఉండిపోయే ఇలాంటి రాజకీయ నాయకులా రాష్ట్రాన్ని బాగు చేసేది అని కొందరన్నారు.  
 
ఇప్పుడు వీటన్నింటికీ ఫులుస్టాప్ పెట్టే ఛాన్స్ ఆయనకు వచ్చింది.  లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చారు.  ఎవరి సొంత ప్రాంతాలకు వారు వెళుతున్నారు.  తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఇరు రాష్ట్రాల డీజీపీల అనుమతులు తీసుకుని ఏపీకి వచ్చేశారు.  కాబట్టి పవన్ కూడా పర్మిషన్ తీసుకుని రాష్ట్రంలోకి రావచ్చు.  జనసేన కార్యకర్తలు సైతం తమ లీడర్ కూడా వెనక్కి వచ్చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు.
 
ఇక సినిమా షూటింగ్లకు కూడా అనుమతులు వచ్చేశాయి.  ఇంకో పది పదిహేను రోజుల్లో అవి  మొదలవుతాయి.  అసలే అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు దొరికితే పవ‌న్‌ను ఇప్పుడప్పుడే వదలకూడదనే ఆలోచనలో ఉన్నారు.  కనుక పవన్ షూటింగుల్లో బిజీ కాకముందే ఈ గ్యాప్లో ఒకసారి రాష్ట్రానికి వచ్చి శ్రేణులను నేరుగా కలిసి పెండింగ్ ఉన్న పనుల్ని చూసుకుని, ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని కలవడం, రాజధాని రైతులతో మాట్లాడటం లాంటివి చేస్తే మంచిది.  అప్పుడే జనసైనికులకు కొంత ఉత్సాహం వస్తుంది.  పైగా విమర్శలకు చెక్ పెట్టొచ్చు.  లేకపోతే చంద్రబాబు కూడా వచ్చారు కానీ పవ‌న్‌కే రాష్ట్రానికి తిరిగి  రావాలనే బుద్ది పుట్టినట్టు లేదు అంటారు ఇతర పార్టీల వాళ్ళు.