కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సినీకార్మికుల భృతి సహాయార్థం కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) నిరంతరం పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చారిటీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మంగళవారం ఒక్కరోజే 1000 మంది సినీకార్మికులకు నిత్యావసరాలు అందించారు. సీసీసీ సరుకుల పంపిణీ చేస్తున్న టీమ్ పై సీసీసీ రధసారథి మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-“ఒకే రోజు వెయ్యి మందికి సరుకులు పంపిణీ చేశాం అంటే ఆశ్చర్యపోయాను. ఆనందంగా ఉంది. ఇంత పెద్ద పని చేయాలంటే ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకొచ్చి ఇదొక బాధ్యతగా ధర్మంగా భావించి ఈ పని చేసారంటే పరిశ్రమ అంతా ఆశ్చర్యపోతున్నారు. అభినందిస్తున్నారు. ప్రశంసిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ గారు ఈ పంపిణీ విధానం చూసి నాకు ఫోన్ చేసి మరీ అభినందించారు. తమ్మారెడ్డి భరద్వాజ- ఎన్.శంకర్ – మెహర్ రమేష్ కి అభినందనలు“ అని తెలిపారు.
రక్త దాతలు లేక ఎమర్జెన్సీ వైద్యం బంద్!
మెగాస్టార్ చిరంజీవి రక్తదానం పిలుపు విని ఇన్నేళ్లుగా ఇంతమంది ముందుకొచ్చారంటే అన్నయ్య చలువే. గివ్ బ్లడ్ సేవ్ లైఫ్… నినాదంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిరంతరం సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత లాక్ డౌన్ వల్ల బ్లడ్ బ్యాంకులకు రక్త దాతల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పరిస్థితి తీవ్రతను తెలియజేస్తూ.. ఇదే విషయంపై చిరంజీవి యువత అధ్యక్షుడు అభ్యర్థించారు.
“ప్రభుత్వాల నిర్ణయంతో కరోనా లాక్ డౌన్ వల్ల బ్లడ్ బ్యాంకులు అన్నీ లాక్ అయిపోయాయి. రక్త దాతలు ఇంటికే పరిమితం అయిపోవడం వల్ల ఎక్కడా రక్తం దొరకడం లేదు. ముఖ్యంగా తలసిమియా వ్యాధిగ్రస్తులకు నిరంతరం బ్లడ్ అందాల్సి ఉండగా.. రక్తం దొరకక క్లిష్ఠ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ఎందరో ఆపరేషన్లు జరగక ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అంపశయ్యపై ఉన్నారు. రక్తం లభ్యం కాక డాక్టర్లు ఆపరేషన్లు వాయిదా వేస్తున్నారు. అందుకే అందరూ ముందుకొచ్చి పోలీస్ వారి సహకారంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి విచ్చేసి రక్తదానం చేయండి. మీ సమీపంలోని ఏదైనా బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి రక్తదానం చేయండి“ అని అధ్యక్షుడు అన్నారు.