జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌ ల‌కు ఏడాది జైలు శిక్ష… రూ.5 వేల జరిమానా!

సినీ న‌టులు జీవిత‌, రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌కు ప‌రువు న‌ష్టం కేసులో ఏడాది జైలు శిక్ష విధిస్తూ నాంప‌ల్లిలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్ల‌డించింది. ఇదే సమయంలో జైలు శిక్షతోపాటు మ‌రో రూ.5 వేలు జ‌రిమానా కూడా విధించింది.

అవును… సెలబ్రిటి కపుల్ జీవిత, రాజశేఖర్‌‌ లకు ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధ్హిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తోన్న బ్లడ్ బ్యాంక్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం అని తెలుస్తుంది. చిరంజీవి బ్లడ్‌ బ్యాంకుపై 2011లో వారు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల‌పై సినీ నిర్మాత అల్లు అర‌వింద్ అప్పట్లో న్యాయ‌స్థానాన్ని ఆశ్రయించారు.

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌.. తన బావ చిరంజీవి నిర్వహిస్తున్న బ్లడ్‌ బ్యాంకుపై జీవిత, రాజశేఖర్ దంపతులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, అభిమానుల నుంచి రక్తాన్ని ఉచితంగా సేకరించి బయట మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని ఆరోపించారంటూ 2011లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై, ట్రస్టు సేవలపై అసత్య ఆరోపణలు చేశారంటూ జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌ ల‌పై అల్లు అర‌వింద్ ప‌రువునష్టం దావా వేశారు.

అప్పటి నుంచి విచార‌ణ కొన‌సాగుతున్న ఈ కేసులో నాంప‌ల్లి కోర్టు తీర్పు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ నేప‌థ్యంలో జీవిత‌, రాజ‌శేఖ‌ర్ దంప‌తులు జ‌రిమానా చెల్లించ‌డంతో పాటు పైకోర్టులో అప్పీలుకు అవ‌కాశ‌మిస్తూ న్యాయ‌స్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది.

కాగా… జీవిత, రాజశేఖర్ ల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని సంగతి తెలిసిందే. హీరోయిన్‌ గా ఉన్నపుడే హీరో రాజశేఖర్‌ ను వివాహం చేసుకున్న జీవిత.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేయడంతోపాటు రాజశేఖర్ నటించిన కొన్ని సినిమాలకు డైరెక్టర్ గా పని చేశారు. ఇక వారి కుమార్తెలు శివానీ, శివాత్మిక.. ప్రస్తుతం హీరోయిన్లుగా చేస్తున్నారు.

తాజాగా జీవిత.. రజినీకాంత్ ముఖ్యపాత్రలో నటిస్తోన్న “లాల్ సలాం” సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తోండగా… అటు రాజశేఖర్ కూడా కొన్ని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని తెలుస్తుంది.