“సినిమాను పరిశ్రమగా గుర్తించండి” ప్రధానికి విజ్ఞప్తి 

భారత చలన చిత్ర రంగాన్ని పరిశ్రమగా గుర్తించమని  ప్రధాని నరేంద్ర మోడీ కి సినిమా ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. భారత సినిమా రంగం ఇప్పుడు ప్రపంచదేశాల్లో తన ఉనికిని  చాటుకుంటూ , ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుందని , దేశ  సంస్కృతీ,సంప్రదాయాలు ప్రతిబింబిస్తూ ముందుకు పోతుందని వారు ప్రధానికి వివరించారు .

సినిమారంగ సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీకి వివరించడానికి  మంగళవారం నాడు ముంబై నుంచి ఓ ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్ళింది. ఈ బృందంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, కేంద్ర సెన్సార్  అధికారి  ప్రసూన్ జోషి, అక్షయ్ కుమార్ , అజయ్ దేవగన్ , కరణ్  జోహార్ , రితేష్ సిద్వానీ , సిద్దార్థ్ రాయ్  మొదలైన వారు వున్నారు . అయితే ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం .

ఈ సమావేశంలో సినిమా రంగంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానికి వివరించారు . అందరు చెప్పింది మోడీ సావధానంగా విన్నారు .

రితేష్ సిధ్వాని మాట్లాడుతూ , భారతీయ సినిమా  దేశాలలో ముఖ్య భూమిక నిర్వహిస్తుందని , చెప్పాలంటే  సాంస్కృతిక రాయబారి పాత్రను పోషిస్తున్నదని , అందుకే ఈ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై ప్రధాని స్పందిస్తూ భారతీయ సినిమా గొప్పదనం తనకు తెలుసునని అన్నారు. అయితే దీనిపై ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడవలసి వుంది.