అంతా అనుకున్నట్టే లాక్ డౌన్ ని దేశ ప్రధాని పొడిగించారు. మే 3 వరకూ పొడిగింపు తప్పనిసరి అయ్యింది. ఈ నాలుగు రోజులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేడు అధికారికంగా ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా మరోసారి ప్రజా రవాణా సహా ప్రతిదీ మరో 19 రోజుల పాటు బంద్ అని క్లారిటీ వచ్చేసింది. నెలరోజులుగా ఈ లాక్ డౌన్ కొనసాగుతోంది. టోటల్ గా 49 రోజుల లాక్ డౌన్ అట్టుడికించేస్తోంది. ఇప్పటికే ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారీ విలయతాండవం చేస్తుంటే ఆ టెన్షన్ ని తట్టుకోలేని పరిస్థితి నెలకొంది.
ఇక వినోద పరిశ్రమపై లాక్ డౌన్ ప్రభావం అంతా ఇంతా కాదు. నెలరోజులుగా షూటింగుల్లేక ఈ రంగంపై ఆధారపడ్డ వేలాది మంది కార్మికులు కనీస నిత్యావసరాలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. ఇక సినిమాలు తీసి రిలీజ్ చేయలేని సన్నివేశంలో నిర్మాతల నష్టం అంతా ఇంతా కాదు. ఓవైపు లాక్ డౌన్ ఎత్తేసినా థియేటర్లకు జనం రారన్న భయంతో ఇప్పటికే పలువురు డిజిటల్ – ఓటీటీ వేదికలపై సినిమాల్ని రిలీజ్ చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆ రకంగా కనీసం పెట్టుబడుల్ని తిరిగి రాబట్టాలన్నది ప్లాన్. అయితే ఇదంతా సవ్యంగా సాగితేనే సాధ్యం. ఇకపోతే పెద్ద బడ్జెట్లతో పాన్ ఇండియా కేటగిరీలో టాలీవుడ్ లోనే మూడు నాలుగు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇవన్నీ షూటింగుల వాయిదా వల్ల అంతకంతకు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ సహా పవన్ – క్రిష్ మూవీ.. ప్రభాస్ జాన్ చిత్రాలపై తీవ్ర ప్రభావం పడిందని అర్థమవుతోంది. ఆయా సినిమాల షూటింగుల వాయిదాతో రిలీజ్ లు ఆలస్యమయ్యేందుకు ఆస్కారం ఉంది. భారీ బడ్జెట్లతో సావాసం కాబట్టి పాన్ ఇండియా సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సన్నివేశం కనిపిస్తోంది.
ఇక బడ్జెట్లను అదుపులోకి తెచ్చే పాఠాల్ని కూడా కరోనా నేర్పిస్తోంది. ఇప్పటికే సెట్స్ పై ఉన్నవి.. త్వరలో ప్రారంభం కావాల్సినవి కూడా బడ్జెట్లను తగ్గించుకోకపోతే ఆ మేరకు పెను భారం తప్పదని సీన్ చెబుతోంది. ఇంకా స్టార్ హీరోలు స్టార్ టెక్నీషియన్స్ దర్శకులు సైతం పారితోషికాల్లో భారీ డిస్కౌంట్లు ఇస్తేనే పరిశ్రమ కోలుకునే వీలుంటుంది. ఇప్పటికే చిత్రీకరణలు పూర్తి చేసుకున్న సినిమాలు రిలీజ్ కాకపోతే ఆ మేరకు నిర్మాతలు నష్టపోయి సినిమాలు తీయకపోతే అది ఉపాధిపై తీవ్రంగా దెబ్బ కొడుతుంది. ఇక కాస్ట్ కంట్రోల్ కి అన్ని శాఖల నుంచి సాయం లేకపోయినా నిర్మాతలు సినిమాలు తెరకెక్కించేందుకు సాహసించలేరు. ఇప్పుడున్న సన్నివేశంలో మరో ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఇదే సన్నివేశం కనిపిస్తోంది. కరోనా విలయం టాలీవుడ్ పై అసాధారణంగా పడిందన్నది అర్థమవుతోంది. కేవలం అగ్ర హీరోల సినిమాలే కాదు చిన్న హీరోలు మిడ్ రేంజ్ హీరోల సినిమాలపైనా ఈ ప్రభావం తీవ్రంగానే ఉంది. మరి ఇలాంటి క్రైసిస్ లో దిద్దుబాటు చర్యల్ని చేపట్టేందుకు అటు ఫిలింఛాంబర్ కానీ.. నిర్మాతల మండలి కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి? ఇక ఆర్టిస్టుల పారితోషికాల్ని కంట్రోల్ లో ఉంచేందుకు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? కార్మికుల భత్యాల తగ్గింపు పరంగా ఫెడరేషన్ నిర్ణయం ఎలా ఉండనుంది? ఇవన్నీ టాలీవుడ్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయని అంచనా వేస్తున్నారు.