లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ కి తీవ్ర నష్టం వాటిల్లింది . తాజాగా మే 3 నుంచి 17 వరకూ తాజాగా లాక్ డౌన్ పొడిగించారు. అటుపై పరిస్థితులను బట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. మరోసారి పొడిగించినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. ఇప్పటికే జూన్ వరకూ లాక్ డౌన్ ఉంటుందని ఊహాగానాలొస్తున్నాయి. దశల వారిగా లాక్ డౌన్ ఎత్తేవేస్తారని…దానికి తగ్గట్టు కొన్ని మినహాయింపులిస్తారన్నది నిపుణుల అభిప్రాయం. అయితే సినిమా థియేటర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరో ఆరు నెలలు పాటు మూత పడటం ఖాయమని ఇప్పటికే నిర్మాతలు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా హింట్ ఇచ్చేసింది.
సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్ లు చేసుకునే అవకాశం కనిపిస్తున్నా….సెట్స్ కు వెళ్లిన తర్వాత సామాజిక దూరం పాటించడం అన్నది అసాధ్యం. సినిమా షూటింగ్ అంటే వందలాంది మంది ఒకే చోట పనిచేస్తారు. అలాంటి చోట సోషల్ డిస్టెన్స్ అసాధ్యమని…ఈ నేపథ్యంలో షూటింగ్ లు కూడా ఆరు నెలలు వరకూ చేసే అవకాశం లేదని అంటున్నారు. అయితే అదే జరిగితే నిర్మాతకు మరింత నష్టం తప్పదని తెలుస్తోంది. అనూహ్యంగా భారత్ లో లాక్ డౌన్ తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి లాక్ డౌన్ పొడిగించుకుంటూ వెళ్లడం తప్ప మరో మార్గం లేకపోయింది. జూన్…జూలై వరకూ క్లియర్ అయిపోయినా షూటింగ్ లు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడ వేసిన సెట్లు పాడైపోయి కూలిపోవాల్సిందే.
ఇప్పటికే హైదరాబాద్ లో రామాజీ ఫిలిం సిటీ, అన్న పూర్ణ స్టూడియోస్, కోకాపేట్, అల్యుమినియం ఫ్యాక్టరీలలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి వేర్వేసు సినిమా షూటింగ్ లు నిమిత్తం సెట్లు నిర్మించారు. కొన్ని సినిమాలు కొద్ది భాగం షూటింగ్ జరుపుకున్నాయి. కానీ లాక్ డౌన్ తర్వాత ఎక్కడికక్కడ తాళం పడటంతో సీన్ మారిపోయింది. ఇప్పటికే నలభై రోజుల పైన గడిచిపోయింది. ఇంకా నెల..రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే సెట్లు ఎందుకు పనికిరాకుండా పోతాయి. జూన్ చివరి వారం నుంచి మళ్లీ వర్షాలు మొదలైపోతాయి. దీంతో సెట్లు పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంది. అదే జరిగితే నిర్మాతకు భారీ నష్టాలు తప్పవు. ఇప్పటికే తలైవి షూటింగ్ కోసం హైదరాబాద్ లో వేసిన సెట్లు పనికిరాకుండా పోవడంతో నిర్మాతకు 5 కోట్ల వరకూ నష్టం వచ్చిందని తాజాగా యూనిట్ రివీల్ చేసింది.