సూపర్‌స్టార్ మహేష్ బాబు సౌత్ స్టార్ హీరోల్లో పెద్ద స్టార్ హీరో అనే చెప్పాలి. బాలీవుడ్ టాప్ హీరోల చిత్రాలు కూడా ఎప్పుడూ ఒన్ మిలియన్ డాలర్ కలెక్షన్ ను టచ్ చేయలేదు. అలాంటి సమయంలో మహేష్ సినిమాలు 1 మిలియన్ డాలర్ మార్క్ టచ్ చేశాయి. మిగతా స్టార్ లు 1 మిలియన్ సాధిస్తే మహేష్ సినిమాలు మాత్రం రెండు.. మూడు మిలియన్లు సాధించేవి. అయితే గత కొంతకాలంగా మహేష్ ఓవర్సీస్ మార్కెట్ మాత్రం కాస్త కష్టాల్లో పడింది.
మహేష్ మార్కెట్ ఎక్కువని ఓవర్సీస్‌లో రైట్స్‌ను కాస్త ఎక్కువ రేట్లతో అమ్ముతుంటే అవి కాస్త బ్రేక్ ఈవెన్ కావడం లేదు. ఇక మహేష్‌బాబు తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు` చిత్రమే తీసుకుంటే నిర్మాతలకు ఆయన సన్నిహితులైన వారిద్వారా రిలీజ్ చేసుకున్నారు. మహేష్ కు ఉన్న క్రేజ్‌ని బట్టి సంక్రాంతికి విడుదలైన మిగతా చిత్రాలతో పోలిస్తే ఎక్కువ స్క్రీన్స్ లో మహేష్ సినిమానే విడుదల చేశారు. అదే విధంగా టికెట్ రేట్లు కూడా మిగతా వాటికంటే ఇదే కాస్త ఎక్కువగా పెట్టారు. అయినా కూడా కథలో బలంలేకపోవడంతో ఆశించినంత భారీ విజయాన్ని మాత్రం సాధించలేదు. ఏదో కలెక్షన్లు అంత ఇంత అంటూ కేవలం అవి పోస్టర్లకే పరిమితం తప్పించి ఈ చిత్రం మాస్ మూవీ కావడంతో ఓవర్సీస్‌లో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అనిల్ రావిపూడి సినిమాలకు ఓవర్సీస్ లో పెద్దగా ఆదరణ దక్కదు. అది కూడా ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపించిందని అంటున్నారు.
ఇక కేవలం యూఎస్ వరకు తీసుకున్నా సంక్రాంతి బరిలో `సరిలేరు` చిత్రం వెనకపడిపోయినట్లే. ఇప్పటికే థియేటర్లన్నీ ఖాళీ. ఇక ఏమైనా కాస్తో కూస్తో కలెక్షన్లు ఉన్నాయంటే అది ఆదివారం వరకే అని అంటున్నారు. మొత్తం మీద ఓవర్సీస్ లో ఈ సినిమాకు 5 కోట్ల నష్టం వాటిల్లేలా ఉందని సమాచారం. ఏదేమైనా మహేష్ తన సినిమాలు ఒకే చేసే సమయంలో ఓవర్సీస్ ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఓవర్‌సీస్‌లో దెబ్బపడేటట్లే ఉంది.