కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో 24 శాఖల సినీకార్మికులకు సహాయం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ఒక కమిటీ తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తెరాస ప్రభుత్వం సాయం అందుతోంది. నాయకులు సినీపెద్దలు కలిసి కార్మికులకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు. పలువురు స్టార్లు సీసీసీకి భారీగా విరాళాలిచ్చారు. ఇకపోతే ఇంతగా ఎందరో స్పందిస్తున్నా టాలీవుడ్ లో దశాబ్ధాల పాటు తిష్ఠ వేసిన అగ్ర కథానాయికలు కానీ.. లక్షల్లో పారితోషికాలు అందుకునే ద్వితీయ శ్రేణి నాయికలు కానీ కనీస మాత్రంగా సాయం చేయకపోవడంపై తీవ్ర విమర్శలొచ్చాయి.
తాజాగా అగ్ర కథానాయిక కాజల్ 2 లక్షలు సాయం చేసింది. ఏదో మొహమాట సాయం అంటూ కామెంట్లు వినిపించాయి. ఇక ఇతర స్టార్ హీరోయిన్లలో నో రెస్పాన్స్ జీరో. అసలు ఎందుకిలా? చాలా వరకూ సాయం చేసే గుణం ఉన్నా .. కరోనా విషయంలోనే స్పందించడం లేదు ఎందుకనో.. అన్న విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తాయి. కోట్లలో పారితోషికాలు అందుకున్నా కానీ .. ఎందుకిలా చేస్తున్నారు? మీడియా అంతగా తిట్టిపోసినా పట్టించుకోనే లేదు. జనాల్లో తీవ్రమైన కామెంట్లు వినిపిస్తున్నా .. ఇప్పటికీ సదరు కథానాయికల వైఖరి మారకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక వార్షికాదాయం కోట్లలో ఉన్నా పలువురు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం ఈ కష్ట కాలంలో స్పందించిందేం లేదు. కొందరు తృతీయ శ్రేణి ఆర్టిస్టులు కనీసం నిత్యావసరాల్ని పంచేందుకు ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచారు కానీ కథానాయికలు.. బాగా సంపాదించే క్యారెక్టర్ ఆర్టిస్టులు నెలరోజుల లాక్ డౌన్ తర్వాత కూడా ఇలా బిగదీసుకుని ఉండిపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.