బిత్తిరి సత్తిని .. రౌండప్ చేసి తీసుకెళ్లిన పోలీసులు!

పోలీసులు ఫార్సలింగ్ చేస్తున్నారంటూ బిత్తిరి సత్తి

బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి కుమార్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.తీన్మార్ వార్తలతో తెలంగాణ సామాన్య ప్రజానీకంలోకి దూసుకుపోయిన పేరు బిత్తిరి సత్తి. ఇదో పాపులర్ టీవీ షో గా వీ6 ఛానల్‌లో ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యేది. ఈ న్యూస్ షోకు తెలంగాణ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

ప్రధానంగా తెలంగాణ గ్రామీణ జనాభాను విశేషంగా ఆకట్టుకున్న కార్యక్రమం ఇప్పుడు రావటం లేదు. ఈ కార్యక్రమం ద్వారా వీ6 ఛానల్ తెలంగాణలో చాలా ఫేమస్ అయ్యింది. అయితే ఇప్పుడా పోగ్రాం కొద్దిపాటి మార్పులు చేర్పులతో టీవి9లో వస్తోంది. ఈ రోజు ఆయన్ను టాంక్ బండ్ వద్ద పోలీస్ లు రౌండప్ చేసి తీసుకువెళ్లారు. ఎందుకూ అంటే..

ఈ రోజు ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం హుస్సేన్ సాగర్ కు సమీపంలోని క్రేన్ నెంబర్ 6 వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం జరిపేందుకు పోలీసులు, స్థానిక అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గణేశుడు చేరుకోవడానికి కొద్దిసేపటి ముందు హుస్సేన్ సాగర్ వద్ద ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. టీవీ9 ప్రతినిధి ఇస్మార్ట్ సత్తి హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ చేరుకుని లైవ్ రిపోర్టింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు.

దీంతో ఒక్కసారిగా అక్కడికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ సైదిరెడ్డి మాట్లాడుతూ..‘సార్.. మీరు ఇక్కడుంటే పబ్లిక్ ను కంట్రోల్ చేయడం కష్టం. మీరు మాతో రండి’ అంటూ పక్కకు తీసుకెళ్లిపోయారు. దీంతో తాను ఇక తిరిగిరాననీ, పోలీసులు తనను ఎక్కడికో ఫార్సలింగ్(పార్సిల్) చేయబోతున్నారని సత్తి నవ్వులు పూయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.