కోవిడ్-19 తో పోరాడి వైరస్ భయాన్ని జయించి విజయవంతంగా బయటపడిన వ్యక్తులు దానం చేసిన రక్త ప్లాస్మా వైరస్ సోకిన ఇతర రోగుల చికిత్సలో గేమ్ ఛేంజర్ గా మారింది. ఆ మేరకు గాంధీ ఆస్పత్రి వర్గాలు చేసిన ప్రయోగం సత్ఫలితాలివ్వడంతో ప్రస్తుతం ప్రభుత్వాలు ఈ చికిత్సా విధానానికి అనుమతులు ఇచ్చాయి. అంతేకాదు రక్త ప్లాస్మా దానం చేయాల్సిందిగా ఇప్పటికే క్యాంపెయిన్ స్టార్టయ్యింది.
బ్రోచేవారెవరురా ఫేం యంగ్ హీరో శ్రీవిష్ణు ఇప్పటికే రక్త ప్లాన్మా దానం చేయాల్సిందిగా విస్త్రత ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాల్లో అతడి పిలుపును అందుకుని పలువురు స్పందించారని తెలుస్తోంది. అతడు విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించి పలువురు స్టార్లు దీనిని సోషల్ మీడియాల్లో ప్రచారం చేస్తుంటే మంచి ఫలితమే వస్తోందట. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ట్విట్టర్‌లో ప్లాస్మా దానంపై ప్రచారం చేయడం హాట్ టాపిక్ గా మారింది. కోవిడ్-19తో పోరాడి ప్రాణాలతో బయటపడిన వారందరికీ ప్లాస్మా దానం చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆర్‌ఆర్‌ఆర్ దర్శకుడిగా ఆయన పిలుపు ప్రస్తుతం వైరల్ గా మారింది. కోలుకున్న రోగులంతా ప్లాస్మా దాతలుగా మారి ప్రాణాలను కాపాడాలని రాజమౌళి కోరారు. COVID-19 సోకినా సిగ్గు పడాల్సిన పని లేదు. దయచేసి ప్రాణాలను కాపాడకుండా సామాజిక కళంకం తేవొద్దు. మిమ్మల్ని మీరు నిరోధించవద్దు.. దానానికి సిద్ధం కండి“ అని రాజమౌళి ట్వీట్ చేశారు. దాతలంతా http://givered.in వెబ్ సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఒక ఫోన్ నంబర్ ని కూడా రాజమౌళి షేర్ చేశారు.