ప్రేమ బ్రేకప్‌ అవ్వడంతో మళ్లీ నటనపై దృష్టి!?

Shruthi Hassan
శ్రుతిహాసన్‌ ప్రేమలో పడి కొంత కాలం నటనకు దూరం అయిన విషయం తెలిసిందే. అయితే తాను ఆ సమయంలో ఖాళీగా మాత్రం లేనని, తనకు ఇష్టమైన సంగీత ఆల్బమ్స్‌ రూపొందిస్తూ బిజీగానే ఉన్నానని చెప్పు కొచ్చింది. అయితే ప్రేమ బ్రేకప్‌ అవ్వడంతో ఇటీవల మళ్లీ నటనపై దృష్టి సారించింది. అంతే కాదు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించేస్తోంది కూడా.హిందీలో కాజోల్‌తో కలిసి ఒక వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. మరిన్ని చిత్రాల్లో నటించే విషయమై కథలు వింటున్నట్లు చెప్పింది. మొత్తం మీద నటిగా ఇప్పుడు బిజీగా ఉంది.
 
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతిహాసన్‌ మీడియాతో మాట్లాడుతూ… ప్రధానంగా తన తండ్రి కమల్ హసన్ రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఎప్పుడూ తండ్రికి తన మద్దతు ఉంటుందని చెప్పింది. అయితే తనకు రాజకీయ పరిజ్ఞానం లేదని చెప్పింది. రాజకీయాల్లోకి వస్తానా? అన్నది చెప్పలేనని అంది. తాను ఇతరుల పనితో పోల్చుకోవడానికి ఇష్టపడనని చెప్పింది. భగవంతుడి దయ వల్ల తాను ఏం సాధించగలనో ఆ పనే చేస్తానని పేర్కొంది. ఇక తన తండ్రి కమల్ హసన్ గురించి చెప్పాలంటే.. ఆయనకు చిన్నతనం నుంచే సామాజిక స్పృహ ఎక్కువ అని తెలిపింది. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చెప్పింది.