బాహుబలి ఫ్రాంఛైజీ టాలీవుడ్ లో ఎన్నో మార్పులకు కారణమైంది. బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు కలిపి అమెరికా నుంచి ఏకంగా వంద కోట్లు పైగా వసూలు చేయడంతో తెలుగు సినిమా మార్కెట్ దానికనుగుణంగా అనూహ్యంగా పుంజుకుంది. 10 మిలియన్ డాలర్లను తెలుగు సినిమా విదేశీ మార్కెట్ నుంచి వసూలు చేస్తుంది అన్న మాటే ఎంతో గొప్పగా వినిపించింది. బాహుబలి పుణ్యమా అని నాన్ బాహుబలి కేటగిరీలో అగ్ర హీరోల సినిమాలు అమెరికా సహా ఓవర్సీస్ మార్కెట్లో అద్భుత వసూళ్లను సాధించాయి.
రామ్ చరణ్ నటించిన రంగస్థలం 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేయడం ఓ సంచలనం. ఇటీవల అల వైకుంఠపురములో సైతం అమెరికాలో చక్కని రికార్డు నెలకొల్పింది. ఈ మధ్యలో మహేష్ – తారక్ నటించిన సినిమాలు మంచి మార్కెట్ ని ఓవర్సీస్ లో అందుకున్నాయి. అయితే 2020 మన అగ్ర హీరోల సినిమాలకు అమెరికాలో అంత ఉంటుందా? అన్నది విశ్లేషిస్తే ససేమిరా అనేయాల్సిన పరిస్థితి ఉంది. ఊహించని విధంగా కరోనా పంచ్ ఉండనుందని అర్థమవుతోంది. అమెరికాలో రోజు రోజుకు వేలాది మరణాలు కలచివేస్తున్నాయి. అక్కడ ఇప్పట్లో కరోనా కట్టడి సాధ్యమేనా? అనేంతగా విజృంభిస్తోంది.
ఈ నేపథ్యంలో మల్టీప్లెక్సులు.. థియేటర్లు.. మినీ థియేటర్లు అన్నీ మూత పడ్డాయి. ఇక కొన్ని నెలల పాటు కరోనా కలకలం కొనసాగుతుంది కాబట్టి అటుపైనా థియేటర్లను ఓపెన్ చేసే ఛాన్సుంటుందా? అంటే సందేహం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే కళ్యాణ మంటపాలుగా మార్చుకునేందుకు థియేటర్ యజమానులకు వెసులు బాటు ఉంది కానీ అమెరికాలో థియేటర్లు మూత పడితే అలాంటి ఆస్కారమే ఉండదు. అందుకే ఇప్పుడు అక్క డ భీతావహ సన్నివేశాన్ని అంచనా వేస్తుంటే మతి చెడుతోంది. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఇప్పట్లో అమెరికా కోలుకోవడం కష్టమే. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టి మహమ్మారీకి విరుగుడు తెస్తేనే తిరిగి జనసమ్మర్థంగా ఉండే థియేటర్లు ఓపెన్ అవుతాయి.
అప్పుడు మాత్రమే అటు అమెరికా అయినా ఇటు ఇండియా అయినా తిరిగి యథావిధి స్థితికి చేరుతాయి. కానీ ఇప్పట్లో ఆ సీన్ ఏదీ కనిపించడం లేదు. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో రూమర్లు తప్ప గ్యారెంటీ కనిపించడం లేదు. దీంతో టాలీవుడ్ భవిష్యత్ ఏమిటి? అన్నది గందరగోళంలో పడిపోయింది. అమెరికాపై తెలుగు చిత్రసీమ ఎంతో ఆధారపడి ఉంది. యుఎస్ఏలో పోటీపడి కొనుక్కునే పంపిణీదారులంతా ఇప్పుడు కష్టకాలంలోనే పడిపోయారు. ఇలాంటప్పుడు పోటీ వాతావరణంలో సినిమాలు కొనే సీన్ ఉండదు. ఇక 2021 సంక్రాంతికి రావాలనుకుంటున్న పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్ కి విదేశీ మార్కెట్ చాలా వరకూ కష్టమేనన్న విశ్లేషణ సాగుతోంది. భారత్ కంటే విదేశాల్లో వైరస్ విజృంభణ ఓ రేంజులో ఉంది. అది కూడా ఈ పాన్ ఇండియాల కష్టాన్ని ఎగదోస్తోంది. 2021లో రిలీజ్ కి వచ్చే అన్ని పాన్ ఇండియా చిత్రాలపైనా ఆ ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ గండం గట్టెక్కేదెలా? అన్నదానికి దానయ్య దగ్గర… సాటి నిర్మాతల వద్దా చిట్కా ఏమైనా ఉందా? అన్నది చూడాలి.
