యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ నెల 15న తను ప్రేమించిన అమ్మాయి, వృత్తి రీత్యా డాక్లర్ అయిన పల్లవిని వివాహం చేసుకోవాలని ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పల్లవితో ఏర్పడిన పరిచయం పెళ్లి వరకు వచ్చింది. అయితే విధి కరోనా వైరస్ రూపంలో వారి పెళ్లికి అవాంతరం ఎదురైంది. దీంతో పెళ్లిని వాయిదా వేశారు.
అయితే హీరో నిఖిల్ మాత్రం ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే ముందు నిర్ణయించిన ముహూర్తానికే గుళ్లో అయినా పెళ్లి చేసుకోవాలనుకున్నారట. కానీ కుదరలేదని, పెళ్లనేది జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుకని, అది మన అనుకున్న వారి అందరి మధ్య జరిగితేనే దానికి అందం, అర్థం అని నిఖిల్ అంటున్నాడు.
అయితే ఇలాంటి విపత్కర సమయంలో పెళ్లి పెట్టుకుని అందరినీ ఒక చోట చేర్చడం వల్ల ఆ తరువాత ఏదైనా జరగరానిది జరిగితే ఆ బాధ జీవితాంతం వెంటాడుతుందని, అందుకే వివాహాన్ని వాయిదా వేశామని చెబుతున్నాడు. పరిస్థితులన్నీ సద్దుకున్నాక ఓ పెద్ద వేడుకలా తన పెళ్లి జరుగుతుందని నిఖిల్ తాజాగా స్పష్టం చేశాడు.