ఇది 1989వ సంవత్సరం నాటి సంగతి . అంటే ముప్పయి ఏళ్ల ముచ్చట . అరుదైన జ్ఞాపకం .నాగార్జున అక్కినేని తెలుగు, తమిళ ,మలయాళ ,హిందీ రంగాల్లో 90 చిత్రాల్లో నటించాడు . నిన్నే పెళ్లాడుతాకు జాతీయ అవార్డు వచ్చింది . 9 నంది అవార్డులు, 3 ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి . అనేక విభిన్నమైన, చిరస్మరణీయమైన పాత్రల్లో నటించి 32 సంవత్సరాల తరువాత కూడా విజయవంతమైన నటుడుగా కొనసాగుతున్నాడు. నాగార్జున గురించి ఆయన తల్లి అన్నపూర్ణమ్మ చెప్పిన ఆసక్తికమైన సంఘటన .
ఒకరోజు అన్నపూర్ణ స్టూడియో లో అక్కినేని నాగేశ్వర రావు , రాంగోపాల వర్మ తండ్రి సౌండ్ ఇంజనీర్ కృష్ణంరాజు నేను చెట్ల క్రింద కూర్చున్నాము . నాగేశ్వర రావు మాట్లాడటం మొదలు పెడితే అన్ని విషయాల్లోనూ అనర్గళంగా మాట్లాడతారు . ఆయన ముందు అందరు శ్రోతలుగా మారిపోవలసిందే . అలా ఆయన మాట్లాడుతూ వున్నప్పుడు అన్నపూర్ణమ్మ ఇంటి నుంచి కారులో వచ్చారు .
1985 సెప్టెంబర్ 20 న నాగేశ్వర రావు తన రెండవ కుమారుడు నాగార్జునను “విక్రమ్ ‘సినిమాతో హీరోగా పరిచయ చేశాడు . అప్పటికే 15 సినిమాల్లో నటించాడు .ప్రస్తుతం మణిరత్నం సినిమా “గీతాంజలి “లో నటిస్తున్నాడు .
ఆమె వస్తూ ఉడకబెట్టిన మొక్కజొన్న కండెలు తెచ్చారు . ఇంటి నుంచి స్టూడియో కు వచ్చేటప్పుడు అన్నపూర్ణమ్మకు ఎదో ఒకటి తీసుకరావడం అలవాటు . మొక్కజొన్న కండె తినడం పూర్తి అయ్యాక , అన్నపూర్ణమ్మగారితో “మీతో మాటాడాలి ” అన్నాను .
నాగేశ్వర రావు గారు నావైపు చూసి “ఇంటర్వ్యూనా ?” అన్నారు .
“అలాంటిదే ” అన్నాను .
బాయ్ ని పిలిచి రెండు కుర్చీలు దూరంగా వేయించాడు .
అన్నపూర్ణమ్మ గారు ,నేను అక్కడకు వెళ్లి కూర్చున్నాము . నాగేశ్వర రావు గారితో నేను ఎక్కువ వుంటాను వారి ఇంటికి కూడా తరచుగా వెడుతుంటాను . . నాగేశ్వర రావుతో పాటు రెండు మూడు సార్లు వారింట్లో నేను భోజనం చేశాను . అందుకే నేనంటే ఆమె చాలా అభిమానంగా వుంటారు .
అన్నపూర్ణమ్మ గారు నా వైపు చూసి “బాబు మణిరత్నం సినిమాలో నటించడం చాలా సంతోషంగా వుంది ” అన్నారు .
“గీతాంజలి నాగార్జునకు మంచి పేరు తెచ్చిపెడుతుంది “అన్నాను
“అవును మాకందరికీ అదే నమ్మకం వుంది ” అని చెప్పారు .
“నాగార్జున గురించి మీరేమనుకుంటున్నారు ?” అడిగాను
‘నాగార్జున జాతకాన్ని నిజం చేశాడు ” అన్నారు .
“జాతకమా ” అంటూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాను
“అవును ” అని అన్నపూర్ణమ్మ చెప్పడం మొదలు పెట్టారు .
“నాగార్జునకు చిన్నప్పుడే జాతకం రాయించాము . కెమెరామన్ రామకృష్ణ నాగార్జునకు జాతకం రాశాడు . రామకృష్ణ గారు జాతకాలు బాగా వ్రాస్తాడు . ఆయన రాసినవన్నీ అంతకు ముందు జరిగాయి. అందుకే ఆయన్ని అడగగానే రాసిచ్చాడు . నాగార్జున కచ్చితంగా నటుడవుతాడని , నటుడుగా మంచి పేరు సంపాదిస్తాడని ఆయన రాశాడు . చిన్నప్పుడు వాళ్ళ నాన్న షూటింగ్ నుంచి వచ్చాక ఆ డ్రెస్ వేసుకొని నటిస్తూ ఉండేవాడు . మేము ఆందించేవాళ్ళం .
వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు ‘సుడిగుండాలు “, “వెలుగునీడలు ” చిత్రాల్లో బాల నటుడుగా కనిపిస్తాడు . ఆతరువాత చదువుకునేటప్పుడు ఇక నటన గురించి మేము పట్టించుకోలేదు .
చదువు పూర్తి అయినా తరువాత వివాహం చెయ్యలకున్నప్పుడు నిర్మాత డి . రామానాయుడు కుమార్తె లక్ష్మి అయితే బాగుంటుందని అనుకున్నాము . నాగార్జున కు అప్పటికి నటుడుగా మారాలనే ఉద్దేశ్యం లేదు .అందుకే లక్ష్మి సంతోషంగా ఒప్పుకుంది . ఆమెకు నటుడిని చేసుకోవడం ఇష్టం లేదు . 1984లో నాగార్జున, లక్ష్మి వివాహం జరిగింది . పెళ్లయిన తరువాత లక్ష్మి నాకు చెప్పింది తన జాతకం ప్రకారం తనకు నటుడుతో వివాహం జరుగుతుందని , ఈ విషయం ఈ మధ్యనే చెప్పింది .
నాగార్జున నటుడుగా మారాలని ఉందని ముందు నాకు గాని ,వాళ్ళ నాన్నకు కానీ చెప్పలేదు . వాళ్ళ అన్న వెంకట్ కు చెప్పాడు.
ఒకరోజు నాగార్జున నాతొ “అమ్మా నాకు నటించాలని వుంది ,నటుడు నవుతాను “అని చెప్పాడు .
నాకప్పుడు లక్ష్మి గుర్తుకు వచ్చింది . ఆమెకు తన భర్త నటుడు కావడం ఇష్టం లేదు .
” బాబు నాకు చాలా సంతోషంగా వుంది . అయితే ముందు నువ్వు నీ భార్య లక్ష్మి అంగీకారం తీసుకో , ఆమె మస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే నువ్వు నట జీవితాన్ని ఎన్నుకో “అని సలహా ఇచ్చాను.
నాగార్జున నా సలహా పాటించాడు . లక్ష్మి అనుమతి తీసుకున్నాడు . తరువాత వాళ్ళ నాన్నగారికి చెప్పాడు .
1985 సెప్టెంబర్ 20న నాగేశ్వర రావు గారిపుట్టిన రోజు నాడు మధుసూదన రావు గారి దర్శకత్వంలో నాగార్జున, శోభన జంటగా “విక్రమ్ ” సినిమా ప్రారంభమైన సంగతి మీకు తెలుసు . చాలా ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది
ఇక ఇప్పుడు నేను చెప్పేదేమంటే రామ కృష్ణారావు గారు వ్రాసిన జాతకం నిజమైంది . లక్ష్మికి చెప్పిన జాతకం కూడా నిజమైంది .
నా భర్త సాధించిన విజయాలు చూసి సంతోషపడి, గర్వపడిన నేను , తండ్రి స్పూర్తితో నటుడైన నాగార్జునను చూసి తల్లిగా ఇప్పుడు ఎంతో సంతృప్తి పొందుతున్నా . ఏ తల్లికీ దక్కని అరుదైన , అపూర్వమైన విషయం ” అని చెప్పారు అన్నపూర్ణమ్మ .
అప్పుడామె కళ్ళలో మెరుపు కనిపించింది .
-భగీరథ