థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేసే సమయం కాదిది. అందుకు మరో ఆరు నెలలు ఆగాల్సిందే. అది కూడా కరోనా వైరస్ పూర్తిగా అంతమైందని తెలిస్తేనే లేదంటే భారీ సమూహాలకు ప్రభుత్వాలు అనుమతించే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో అందరి చూపు ఓటీటీ వైపు పడింది. ఇప్పటికే రిలీజ్‌కు రెడీగా వున్న నిర్మాతలు ఓటీటీలతో చర్చలు జరుపుతున్నారు. మొత్తానికకే నష్టపోవడం బెటరా లేక కొంత నష్టంతో సరిపెట్టుకోవడం బెటరా అని ఆలోచిస్తున్నారు.
ఇదిలా వుంటే చేయబోయే సినిమాల గురించి కూడా ఇప్పుడు చర్చనడుస్తోంది. ప్రస్తుత విపత్తు నుంచి టాలీవుడ్ బయటపడాలంటే ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు కొత్త ఐడియాతో ముందుకు రావాలని ఇటీవల నిర్మాత డిజ సురేష్ బాబు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో కదలిక మొదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ తొలి అడుగువేసింది. దర్శకుడు తేజతో రెండు చిత్రాలు, మూడు వెబ్ సిరీస్‌ల కోసం భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు తాజాగా తెలిసింది.
ప్రస్తుతం చర్చల దశలో వున్న ఈ ఒప్పందం ఓ కొలిక్కి వస్తే తేజ డిజిటల్ ఎంట్రీకి మార్గం సుగమం అయినట్టే. తేజ ఇటీవల రెండు భారీ చిత్రాల్ని ప్రకటించారు. రానాతో `రాక్షస రాజు రావణాసురుడు`, గోపీచంద్ హీరోగా `అలిమేలు మంగ వెంకటరమణ`. ప్రస్తుత పరిస్థితుల్లో వెబ్ సిరీస్‌లు చేయడమే మేలని భావిస్తున్న తేజ దగ్గరికి అమెజాన్ ప్రైమ్ భారీ ప్రపోల్‌తో వచ్చినట్టు తెలిసింది. ఇది ఓకే అయితే తెలుగు రైటర్లకు, దర్శకులకు చేతినిండా పనే అయితే షూటింగ్‌లకు అనుమతులే ఇక్కడ పెద్ద సమస్యగా మారింది.